
కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు అర్హతే లేదని సుప్రీంకోర్టు మొహం మీద కొట్టి పంపించిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. మెరిట్స్ మీద తీర్పులు, తీర్మానాలు వస్తాయి కానీ అసలు పిటిషనే చెల్లదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఎంత బలహీనంగా ఉన్నట్లు..? అని ప్రశ్నించారు. లాయర్ మనం చెప్పింది వాదిస్తారని, ఆయనదేం తప్పు లేదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి కావాలనే చంద్రబాబు నాయుడుకు సమయం ఇవ్వాలని బలహీనమైన తప్పుడు పిటిషన్ వేశారని ఆరోపించారు. ముందు నుంచి అనుకున్నట్టే గోదావరిని ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెడుతున్నారని అన్నారు. సంక్రాంతి కానుకగా సిఎం రేవంత్‌రెడ్డి గోదావరిని చంద్రబాబుకు అప్పగించారని ఆరోపించారు. కోర్టులకు లాయర్లు వెళ్తారని..కానీ మంత్రులు వెళ్లడం ఏంటని అడిగారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మంత్రులకు తెలియదని, శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వరాని వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గోదావరి, కృష్ణా జలాలను తాకట్టు పెడుతున్నారని, చంద్రబాబు కనుసన్నల్లో దుర్మార్గం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకు సమయం ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో తప్పుడు పిటిషన్ వేశారని అన్నారు. అంగు ఆర్భాటంగా సుప్రింకోర్టుకు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బయటకు వచ్చే ముందు మొహం చూయించకుండా వెళ్లిపోయారని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ చర్చ చెయ్యకుండా కోర్టుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. చంద్ర బాబు నాయుడుకు చెవిలో చెబితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు అని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు, బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని ఎందుకు చెప్పలేదని అడిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ రెడ్డి చేసేందుకే సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి పంపించారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనుమతిపై ఢిల్లీకి ఎందుకు పోవడం లేదని నిలదీశారు.
కెసిఆర్ అనవసరంగా ఢిల్లీతో పంచాయతీ పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి కోతలు కోశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు అక్రమ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. బిజెపి నుంచి రక్షణ పొందడానికే ఈ చీకటి ఒప్పందం అని ఆరోపించారు. కేసులను కాపాడుకుందుకు కృష్ణ, గోదావరి జలాలను అప్పజెప్పుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యాల మీద ఈ ప్రభుత్వం బతుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు కెసిఆర్ ఉన్నారని చెప్పారు.తెలంగాణ హక్కులను కాపాడుతామని అన్నారు.