Reading Time: < 1 minute

సోలన్: హిమాచల్‌లోని సోలన్‌లోని ఆర్కి మార్కెట్‌లోని ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురు మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ సింగ్ వెల్లడించారు. మృతులలో ప్రియాంష్ అనే ఎనిమిదేళ్ల బిహార్ కు చెందిన బాలుడు ఉన్నట్లు తెలిపారు. మరో ఇద్దరి మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కొంత మంది నెపాలీలు కూడా మిస్ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సోలన్ డిప్యూటీ కమిషనర్ మన్మోహన్ శర్మ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 2.45 గంటలకు ఒక చెక్క భవనంలో మంటలు ప్రారంభమయ్యాయని, పక్కనే ఉన్న భవనాలకు కూడా మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

“ఆర్కి మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత హృదయ విదారక సంఘటన. ఈ ప్రమాదంలో అమాయక చిన్నారి అకాల మరణ వార్త హృదయాన్ని తీవ్రంగా బాధించింది. ఈ కష్ట సమయంలో, మృతుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ఆయన Xలో పోస్ట్ చేశారు.