
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఆయన డ్యాన్స్. ఆయన డ్యాన్స్ చేస్తే టాప్ లేచిపోవాల్సిందే. ఆయన డ్యాన్స్‌కి గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. చిరంజీవికి డ్యాన్స్ కంపోజ్ చేయాలని ప్రతీ ఒక కొరియోగ్రాఫర్ కలలు కంటుంటారు. ఆ అవకాశమే వస్తే.. చిరుతో అద్భుతమైన స్టెప్పులు వేయించి అభిమానులకు సంబరాన్ని అందిస్తారు. కాగా చిరు నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమాలో ‘హుక్ స్టేప్’ సాంగ్‌కు ‘ఆట’ సందీప్ కొరియోగ్రాఫీ చేశారు. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన ఈ హుక్ స్టెప్‌పై రీల్స్ కనిపిస్తున్నాయి.
అయితే ఈ సాంగ్ ఎలా కంపోజ్ చేశారో బ్యాక్ స్టేజీలో ఏం జరిగిందో కొరియోగ్రాఫర్ సందీప్ వెల్లడించారు. ‘‘ మన అందరికీ సమస్యలు ఉంటాయి. ప్రతి నెల ఇఎంఐలు కట్టాలి. ఈ సాంగ్‌కు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో ఇఎంఐ కట్టాలని గుర్తు చేస్తూ వరుసగా ఫోన్లు రావడం మొదలయ్యాయి. సాధారణంగా కంపోజింగ్ సమయంలో నేను ఫోన్ తీసుకెళ్లను. కానీ, ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పడంతో తప్పకుండా ఫోన్ తీసుకువెళ్లాల్సి వచ్చింది. లోపలికి వెళ్లాక కూడా వరుసగా ఫోన్లు వస్తున్నాయి. కోపం వచ్చి ఫోన్ పగలకొట్టేద్దామని అనుకున్నా. అలా ఫోన్ పట్టుకోగానే వెంటనే ఓ ఐడియా వచ్చింది. వెంటనే లైట్స్ అన్ని ఆఫ్ చేసి.. ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి హుక్ స్టెప్ కంపోజ్ చేశా. అది చూసి నా భార్య చప్పట్లు కొట్టింది. దాన్ని ఇంకాస్త డెవలప్ చేసి, ప్రస్తుతం మీరు సినిమాలో చూస్తున్న స్టెప్స్ ఫైనల్ చేశాం. చిరంజీవి గారి గ్రేస్‌ను బట్టి దాన్ని డిజైన్ చేసుకున్నాం’’ అని సందీప్ తెలిపారు.