
హైదరాబాద్: పాత బాస్ కు కోపం రావద్దు.. మాజీ సిఎం కెసిఆర్ కు పేరు రావద్దనేది సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పాతబాస్ ఊరుకోరు.. సిఎం రేవంత్ రెడ్డి రహస్యాలన్నీ ఆయన వద్ద ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రైతన్నలను రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నారని, యూరియా ఇవ్వని వ్యక్తి పాలమూరును సస్యశ్యామలం చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని రేవంత్ రెడ్డి చెప్పేవారని, రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడని కెటిఆర్ విమర్శించారు. పదేపదే మోసపోతే ప్రజలదే తప్పు అవుతుందని, ఐటీ హబ్ పెట్టి 14 పరిశ్రమలు తెస్తే పారిపోయేలా చేశారని మండిపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో పెట్టిన పరిశ్రమలకు రిబ్బన్లు కట్ చేస్తున్నారని, అభివృద్ధి పనులకు డబ్బులు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని తెలియజేశారు.
డబ్బులు మూటలు కట్టి ఢిల్లీకి పంపితే రాష్ట్రంలో పనులకు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. రెండేళ్ల తర్వాత కెసిఆర్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు సిఎం పెద్దపీట వేస్తున్నారని, జడ్చర్ల ఎమ్మెల్యే చెబుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం వస్తుందో? రాదో? తెలియదని.. హామీ ఇవ్వనని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఈ సారి ప్రజలు బొంద పెడతారని ధ్వజమెత్తారు. కొడంగల్ సహా 14 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటమి ఖాయమని హెచ్చరించారు. జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రగులుతుందని.. కాంగ్రెస్ ను దహించివేస్తుందని, హామీలు, పథకాల అమలు గురించి ప్రశ్నిస్తే దూషిస్తున్నారని మండిపడ్డారు. అదృష్టం బాగుండి రేవంత్ సిఎం అయ్యారని, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినా కెసిఆర్ ఉంటారని ప్రజలు భావించారని చెప్పారు. ఎమ్మెల్యేలు లేకుంటే కెసిఆర్ ఎలా ఉంటారనే లాజిక్ మరిచారని ఎద్దేవా చేశారు. మళ్లీ తప్పు చేయకుండా ఎంపిటిసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయ్యాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.