Reading Time: < 1 minute

హైదరాబాద్: ప్రజా భవన్‌లో బాల భరోసా పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నామని.. రూ.50 కోట్లతో దివ్యాంగులకు పరికరాలు అందించామని తెలిపారు. దివ్యాంగులను దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.

ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకొని దివ్యాంగులు ఎదగాలని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో దివ్యాంగులకు స్పూర్తి జైపాల్ రెడ్డి అని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్‌లో, మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్‌ను నామినేట్ చేయాలని ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లు వాళ్ల సమస్యలను వాళ్లే చెప్పుకొనే అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రణామ్ కార్యక్రమంతో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు తీసుకొస్తున్నామన్నారు. ‘‘తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని మనమే దారిలోకి తీసుకురావాలి. తల్లిదండ్రులపై బాధ్యత లేని వారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుంద’’ అని సిఎం రేవంత్ అన్నారు.