
అమరావతి: అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడం గొప్ప విషయం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. సచివాలయంలో ఆదాయార్జన, కేంద్ర పథకాలు, ప్రాజెక్టులపై మంత్రులు, సెక్రటరీలతో, దస్త్రాల పరిష్కారం, ఆన్ లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్లపై సిఎం సమీక్ష నిర్వహించారు. జిఎస్ డిపి, 2047 విజన్ లోని 10 సూత్రాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 29 వేలమంది రైతులు 33 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇవ్వడం ఎక్కడా లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి వస్తుందని తెలియజేశారు. మూడు వేల టిఎంసిలు సముద్రంలోకి పోతున్నాయని, మొదటగా ప్రారంభించింది..పట్టిసీమ ఎత్తిపోతల పదేళ్లు బ్రహ్మాండంగా పనిచేసిందని అన్నారు.
నల్లమల సాగర్.. ఎవరికీ నష్టం లేని ప్రాజెక్టు అని తెలంగాణకు కూడా చెప్పానని, కాళేశ్వరం.. ఎపికి పైన ఉందని.. విభజన తర్వాత ప్రాజెక్టు కట్టారని.. మనం అభ్యంతరం చెప్పలేదని సిఎం పేర్కొన్నారు. నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకుపోయి వాడుకుంటే.. అవసరమైతే సాగర్, శ్రీశైలంలో కొన్ని మిగిలితే ఇద్దరం వాడుకోవచ్చని అన్నారు. మిగిలిన నీళ్లను తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకోవచ్చని, తెలుగుజాతి ఒక్కటే.. అందరం కలిసి పనిచేసుకుదామని చెప్పానని తెలిపారు. 87 శాతం పోలవరం పనులు పూర్తి చేశామని, వచ్చే మార్చికి పోలవరం పూర్తవుతుందని అన్నారు. వచ్చే జూన్ లోపు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.