
భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026కి గాను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణంగా టి-20 ప్రపంచకప్‌లో భారత్‌లో పర్యటించమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బిసిబి).. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి)కి లేఖ రాసింది. దీనిపై ఐసిసి సానుకూలంగా స్పందించిదని బిసిబి పేర్కొంది. కానీ, ఐసిసి మాత్రం బిసిబి అభ్యర్ధనను అంగీకరించలేదు.
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచులు కోల్‌కతా, ముంబై వేదికగా ఆడాల్సింది. అయితే వాటిని చెన్నై తిరువనంతపురంలో ఆడాలని ఐసిసి, బిసిబికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే దీనిని అధికారికంగా ఐసిసి ధృవీకరించాల్సి ఉంది. కానీ, ఈ ప్రతిపాదనలను బిసిబి తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏ నిర్ణయమైనా తమ ప్రభుత్వ అనుమతితోనే తీసుకోనున్నట్లు ఆ బోర్డు చెబుతోంది. ‘ఈ వరల్డ్ కప్ విషయమై మేం మా సొంతంగా ఏ నిర్ణయాలూ తీసుకోం. మా ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఏ విషయమూ వెల్లడిస్తాం’ అని బిసిబి అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.