
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. నిజామాబాద్ లో టిపిసిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ.. సర్వేల ఆధారంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఫాంలు ఇస్తామని, నిజామాబాద్ లో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని, రెండో దఫాలో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో 70శాతం సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని మహేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి ఓట్ల రూపంలో మారనుందని, వేల ఉద్యోగాలను తొలగించిన ఘనత ప్రధాని నరేంద్రమోడీది అని.. కులమతాల మధ్య బిజెపి చిచ్చు పెడుతోందనివిమర్శించారు. పేర్లు మార్చడం కాదు..పేదల తలరాతలు మార్చండని, మతాల పేరుతో రెచ్చగొట్టే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. బిజెపికి ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని, దేవుడి పేరు మీద ఓట్లు అడిగే హక్కు బిజెపికి ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ చరిత్ర గతమేనని.. భవిష్యత్ లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.