Reading Time: 2 minutes

 హైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని తీసేశామని బిజెపి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అనేక మార్పులు, సంస్కరణలు చేస్తున్నామని, మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్చామని తెలియజేశారు. పేదలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశామని, జవాబుదారీ తనాన్ని ఈ పథకంలో తెచ్చామని అన్నారు. గ్రామ పంచాయితీలకు ఉపాధి హామీ పథకం అమలు చేసే అధికారం కల్పించామని, వంద రోజుల పనిదినాన్ని 125 కు పెంచామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రూ. లక్ష కోట్లతో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని, గ్రామాలవారీగా అభివృద్ధి ప్రణాళికలు రచించుకుని మార్పు చేశామని అన్నారు. ఉపాధి హామీ పథకంలో చాలా అవకతవకలు జరిగాయని, ఒక ఏడాది గుంతలు తవ్వితే.. వచ్చే ఏడాది కూడా అక్కడే గుంతలు తవ్వేవారని విమర్శించారు. గ్రామీణ కూలీలకు కూడా నైపుణ్య శిక్షణ పెంచుతామని, విబి- జి రాం జి ద్వారా గిడ్డంకులు నిర్మించాలని నిర్ణయించామని అన్నారు. వ్యవసాయ రంగానికి విబి-జి రాం జిని అనుసంధానం చేస్తామని, రైతుల కోరిక మేరకు విబి-జి రాం జిని తీసుకువచ్చామని చెప్పారు.

అడిగిన వారికి పని ఇవ్వలేని పరిస్థితుల్లో పరిహారం కూడా వచ్చేలా చేస్తామని, ఇది గుంతలు తవ్వే పథకం కాదని.. గ్రామాలను, దేశాన్ని అభివృద్ధి చేసే పథకం అని.. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే పథమని.. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే గ్యారెంటీ పథకమని కిషన్ రెడ్డి కొనియాడారు. కొత్త పథకంతో రాష్ట్రాలపైనే కాదు.. కేంద్రంపై కూడా ఆర్థిక భారం పడుతుందని, కొత్త పథకంతో రాష్ట్రాలకు అదనపు నిధులు వస్తాయని జోస్యం చెప్పారు. పథకం ఎప్పుడు అమలు చేయాలనేది రాష్ట్రాలే నిర్ణయిస్తాయని, దళారీల దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ పథకం అమలు జరగకూడదనే కొత్త చట్టం నేరుగా కూలీల ఖాతాలోనే డబ్బులు పడేలా చట్టం తెచ్చామని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా వంద రోజుల పనిదినాలు దొరకలేదని, కొత్త పథకానికి బడ్జెట్ లో రూ. లక్ష కోట్లకు మించి కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. నీతిఆయోగ్ సూచనల మేరకు పథకంలో మార్పులు చేశామని, గతంలో ఆస్తుల సృష్టి జరగలేదని.. పేదవాడి శ్రమ వృథాగా పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు ఉపాధి హామీ కార్డులు ఇస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.