
వాన కురిసింది
పుష్కర కాలం క్రితం మొదలైంది ఇది
ఇంకా కురుస్తూనే ఉంది అరవై ఏళ్ల కరువు తీరేలా
ఈ వానకు కాలంతో నిమిత్తం లేదు
ఆరుగాలాలను వానాకాలం గానే మార్చింది
ఉగాదితో మొదలైన వాన
శ్రీరామనవమి, ఆషాఢ బోనాలు,
రాఖీల పున్నమి, వినాయక చవితి మీదుగా
హోలీ, ఓనం, బతుకమ్మ,
దసరా నవరాత్రులు దాటుకొని
రంజాన్, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి,
లోహ్రీలను కలుపుకొని
నిరంతరంగా కురుస్తూనే ఉంది
మధ్యలో రాష్ట్రావతరణ, స్వాతంత్ర దినం,
వైతాళికుల జయంతులు,
ప్రత్యేక రోజుల సంబరాలు
అన్నిట్లోనూ, అంతటనూ ఒకటే వాన
ఊరూ వాడ ఏకం అయ్యేలా
నగరం పట్టణం జోడు కట్టేలా
ఎడతెరిపి లేకుండా వాన కురిసింది
వాన ఉరవడి నేలను మాత్రమే కాదు
గోల్కొండ మీది గాలులను
బన్సీలాల్ పేట మెట్ల బావి లోతులను
ఎములాడ రాజన్న గుడి చెరువు ఒడ్డును
రామప్ప గడపను-, గద్వాల దర్వాజను
నేలకొండపల్లి స్తూపాన్ని
నాగార్జునకొండ శిల్పాలను
జోడేఘాట్ అరణ్యాలను, మేడారం,
నాగోబా జాతరలను
చినుకులతో ముంచేసింది
ఇంకేముంది?
ఈ నేల పురివిప్పి నాట్యమాడింది
ఈ మట్టి ఈల వేసి చిందులేసింది
ఈ భూమి డప్పు కొట్టి పాట పాడింది
ఈ పొలం డోలు చప్పుడుతో విన్యాసం చేసింది
గాలి అంతటా ఓ జీవనోత్సవం
నింగి దాక ఉల్లాస కేతనం
అడవి నిండుగా ఉద్వేగ హరితం
కానీ హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో
అదాటున వాన ఆగిపోయింది
చినుకు జాడ తప్పిపోయింది
రచ్చబండ దగ్గర ఇప్పుడు అందరూ అంటున్నారు
ఎక్కడెక్కడి మబ్బులను
మడతపెట్టి
భుజానికి కట్టుకొని మోసుకొని వచ్చిన యోధుడు
ఇప్పుడు లేడు అని..
– డాక్టర్ మామిడి హరికృష్ణ