Reading Time: < 1 minute

హైదరాబాద్: సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కార్పొరేషన్ తో పాటు సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని, ఈ నెల 17న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించామని తలసాని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో రైల్ రోకో, బంద్ లు నిర్వహిస్తామని, నిరవధిక దీక్షలు, అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తామని అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కుట్ర జరుగుతోందని, జిహెచ్ ఎంసి డివిజన్ల పునర్విభజన తప్పుల తడకగా ఉందని విమర్శించారు. మేయర్ కు కూడా తెలియకుండా పునర్విభజన చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.