Reading Time: 2 minutes

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హై దరాబాద్ ఖాళీఅవుతోంది. వరుస సెలవుల తో పట్నవాసులు పల్లెదారి పడుతున్నారు. సంక్రాంతికి గ్రేటర్ హైదరాబాద్‌లోని వివి ధ ప్రాంతాలకు చెందిన వారు తమతమ సొంతూళ్ళకు పయనమయ్యారు. శనివా రం నుండి వరుసగా సెలవులు ఉండటం తో రెండు రోజుల నుండే నగరవాసులు ప ల్లెల బాటపట్టారు. కొందరు సొంత వాహనాల్లో, మరికొందరు ప్రజా రవాణాల ద్వా రా, ఇంకొందరు విమానాల ద్వారా కూడా పయనమై ఊళ్ళకు బయలుదేరారు. ఇటు తెలంగాణ ప్రాంతవాసులు, అటు ఆంధ్రప్రదేశ్ వాసులు కుటుంబ సభ్యులతో సం క్రాంతిని సంతోషంగా జరుపుకునేందుకు ఉద్యోగాలకు సెలవులు పెట్టి, పనులకు వి రామమిచ్చి పండుగంటూ పల్లెలకు వెళ్తున్నారు. దీంతో ఇటు టోల్ గేట్లు, అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నా యి. ఈ వాతావరణం మరో రెండు రోజు లు ఉండేలా పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. ఆర్టీసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినా, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నా, ప్రయాణికులకు సరిపోనందున..ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అధికంగా బస్సులను నడుపుతున్నాయి.

6,431 బస్సులు.. 153 రైళ్ళు..

విద్యాసంస్థలకు జనవరి 10వ తేదీ నుండే సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో నగరవాసులు తమతమ గ్రామాలకు, పట్టణాలకు బయలుదేరడంతో నగర బస్‌స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. జెబిఎస్, ఎంజిబిఎస్, ఉప్పల్ చౌరస్తా, ఎల్‌బీనగర్, ఆరాంఘర్, శంషాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్‌లలో ప్రయాణికులు తాకిడి పెరుగడంతో తెలంగాణ ఆర్టీసి ప్రత్యేకంగా 6,431 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టు ప్రకటించింది. ఈసారి సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వెళ్లేవారి సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనావేసిన అధికారులు ఇటు ఆర్టీసితో పాటు రైల్వే సంస్థ కూడా ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం దక్షిణమధ్య రైల్వే 153కి పైగా ప్రత్యేక రైళ్ళను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించింది. బస్సుల్లో, రైళ్లలో అన్ని కేటగిరీల రిజర్వేషన్లు పుల్ అయ్యాయి. దీనిని గుర్తించిన ప్రైవేట్ ట్రావెల్స్ ప్రత్యేక బస్సులు నడుపుతూ చార్జీలను పెంచేసినట్టు ప్రయాణికులు పేర్కొంటున్నారు. పలువురు టెంపోలు, ట్యాక్సీలు మాట్లాడుకుని పయనమవుతున్నారు. గత శుక్రవారం (జనవరి 9) నుంచి 11వ తేదీ వరకు రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్ అయినట్లు రైల్వే శాఖ తెలిపింది.

గ్రేటర్‌లో ట్రాఫిక్ జామ్..

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ శనివారం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుండి నగర రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. నగరవ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేసినా.. వాహనదారులు పెద్దగా పట్టించుకోలేదు. జనవరి 9 నుంచి 13 వరకు ట్రాఫిక్ అధికంగా ఉంటుందని, జనవరి 16 నుంచి 19 మధ్య ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల వైపు పెద్దఎత్తున ప్రయాణాలు సాగించడం జరుగుతుందని పోలీసులు అంచనావేసి ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకటించినా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్ – ఆరాంఘర్ కారిడార్, ఎస్‌ఆర్‌నగర్,- లక్డికాపూల్, రేతిబౌలి,- కాచిగూడ -, రామంతాపూర్, ఎంజీబీఎస్ – దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, పాదచారుల రాకపోకలతో తీవ్ర రద్దీ ఏర్పడింది.

టోల్‌ప్లాజాల వద్ద..

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకునేవారు అధికంగా విజయవాడ జాతీయ రహదారిని ఎన్నుకోవడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీ సంఖ్యలో బారులు తీరాయి. ఉ. 9 గం.ల నుండి నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. విజయవాడకు ప్రయాణం సాధారణంగా 4 గం.ల నుండి 5 గం.ల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం 910 గం.లు పడుతుందని ప్రయాణికులు వెల్లడిస్తున్నారు. వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న పగిడిపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరాయి. ఎక్కడా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులపై పోలీసులను మోహరించి ట్రాఫిక్‌ను చక్కదిద్దుతున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలు..

ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల్లో సీట్లు నిండిపోయాయి. రైల్వేలు, బస్సల్లో ముందస్తు బుకింగ్ లేకపోవడంతో చాలామంది రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఫలితంగా వాహనాలు జాతీయ రహదారులపై పెరుగుతున్నాయి. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లేవారు హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవేను ఎంచుకుంటే ప్రయాణం సులభంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా సమయానుకూలంగా సొంతూళ్ళకు చేరుకోవచ్చని పోలీసులు వెల్లడిస్తున్నారు.