Reading Time: < 1 minute

విశాఖపట్నం: హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా బుధవారం విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో టి20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా ఈసారి కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా దూకుడు మీద ఉన్నాడు. భారత్ విజయాల్లో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషిస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు.

కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ కళ్లు చెదిరే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే కివీస్ బౌలర్లకు మరోసారి ఇబ్బందులు ఖాయం. ఇషాన్ కిషన్ కూడా జోరుమీదున్నాడు. అతను కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

విశాఖలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతున్నాడు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి తదితరులతో బౌలింగ్ కూడా బాగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా కివీస్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఈసారైన గెలుస్తుందా లేదా వేచి చూడాల్సిందే.