Reading Time: < 1 minute

యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ మేడ్చల్ ఒకటవ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్, మహేంద్ర నగర్ కాలనీకి చెందిన బిట్ల వెంకట్ సాయి (28)కి స్థానికంగా ఉంటున్న యువతిని నాలుగేళ్లు ప్రేమించాడు. వివాహం చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. జనవరి 30,2017న నిందితుడు యువతితో గొడవపెట్టుకుని వివాహం చేసుకోనని చెప్పాడు. దీంతో బాధితురాలు మూడు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

యువతి తల్లి 2017 ఫిబ్రవరి 8 న బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు తనను లైంగికంగా వేధించడమే కాకుండా తన ఫోటోలు బయటపెడతానని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను హత్య చేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించడంతో వాటిని పరిశీలించిన కుషాయిగూడలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి. తిరుపతి నిందితుడిని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.