Reading Time: < 1 minute

సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మేడారం మహాజాతరకు సంబంధించి గద్దెల ప్రాంతంలో చేపట్టిన పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగు తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.251 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు, అవి త్వరితగతిన పూర్తయ్యేలా రాష్ట్ర మంత్రులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.