
పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎపి సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఎపి సచివాలయంలో ఆయన మంత్రులు, కార్యదర్శులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు మాట్లాడుతూ, నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదన్నారు. ఎగువ నుంచి విడుదల చేసిన నీటిని పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తరలించి వాడుకుంటే తప్పేమిటి? అని ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించు కోవచ్చన్నారు. ఎపి ప్రజల ఆశలను తాము నిలబెట్టామని, వారిలో విశ్వాసాన్ని కల్పించామన్నారు. 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామన్నారు.
సూపర్‌సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతిని గతంలో శ్మశానం, ఎడారి అని హేళన చేశారని, కానీ ఇప్పుడు అది ఒక స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని అన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టు అని, అది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడలేదన్నారు. త్వరలో భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం సహకారంతో కాపాడుకున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఎపికే వచ్చాయన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా ఎపి మారిందన్నారు.