Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్‌ః “రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, జన సేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు..” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తేల్చి చెప్పారు. ఇటీవల కొండగట్టు హనుమాన్ దేవాలయానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంపై ఆదివారం తనను కలిసిన విలేకరులతో రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేరని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా టిడిపి, బిజెపి, జనసేన కలిసి కూటమిగా ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామని ఆయన వివరించారు. కాబట్టి పొత్తు లేకుండానే మెజారిటీ స్థానాల్లో గెలుపొందగలమన్న విశ్వాసం ఉందన్నారు. పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తాము అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇదిలాఉండగా పొత్తు విషయంలో రాంచందర్ రావు స్పష్టత ఇచ్చారు. పొత్తు ఉంటే కొంత మేలు జరుగుతుందేమో కానీ, సీట్ల పంపకాల్లో తమకు అవకాశాలు తగ్గుతాయన్న భావన కూడా బిజెపి నేతలు, కార్యకర్తల్లో ఉంది. రాంచందర్ రావు ప్రకటనపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దామని బిజెపి నాయకులు అంటున్నారు.