Reading Time: < 1 minute

మన తెలంగాణ / హైదరాబాద్ : సినిమా టికెట్ రేట్ల పెంపుపై సిపిఐ సీనియర్ నాయకుడు డా. కె. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు చేస్తే వాళ్లకు నష్టం వస్తుందని ప్రజల నుండి దోచుకుంటారా అని నారాయణ ప్రశ్నించారు. వందల కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నారని ఆయన ప్రశ్నించారు.

సినిమా చూసేందుకు ప్రజలు వెళితే వాటర్ బాటిల్ కూడా తీసుకువెళ్లనివ్వరని, బిస్కెట్లు కూడా తీసుకువెళ్లనివ్వరని పేర్కొన్నారు. అక్కడ కొనాలంటే వందల రూపాయలు ఖర్చు చేయాల్సిందేనన్నారు. చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారని మరి వాళ్లందరికి నష్టాలు వస్తే ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. సినిమా మాఫియా, ప్రభుత్వాలు కలిసి ప్రజలను లూటీ చేస్తున్నాయని విమర్శించారు. కొత్త సినిమాల విడుదలకు ముందు బెనిఫిట్ షోలతో పాటు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న బిషయం తెలిసిందే. ప్రీమియర్ షో టికెట్ ధరలు అయితే వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ధరలు పెంచవద్దని నారాయణ డిమాండ్ చేస్తున్నారు.