Reading Time: 3 minutes

కేంద్ర ఎన్‌డిఎ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే దాడులు చేయించి అప్రతిష్టపాలు చేయిస్తుందనే ఆరోపణలు గత కొన్నేళ్లుగా ముమ్మరంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయని హైకోర్టులు, సుప్రీం కోర్టు కూడా మొట్టికాయలు పెట్టినా వాటి వైఖరిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఈడీ దాడుల నిర్వాకం రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. బెంగాల్ లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ గనుల్లో వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు దొంగతనం జరిగిందని 2020 లో సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆసరా చేసుకుని మనీలాండరింగ్ జరిగిందన్న వంకతో ఈడీ ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయంపై దాడులు చేపట్టడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితమే దాఖలైన కేసుపై ఇప్పుడు ఆఘమేఘాలపై బెంగాల్ ఎన్నికల ముందు దర్యాప్తు ఎందుకు చేపడుతున్నట్టు ? ఇదే సమయంలో బొగ్గు స్కామ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రమేయానికి సంబంధించిన ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌లు తన దగ్గర ఉన్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జే బహిరంగంగా వెల్లడించినప్పుడు దర్యాప్తునకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు రంగం లోకి దిగడం లేదు? ఇదంతా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించి అధికార పీఠం దక్కించుకోడానికి కేంద్ర బీజేపీ సర్కారు పన్నుతున్న ఎత్తుగడ గానే భావించవలసి వస్తోంది.

ప్రశాంత్ కిశోర్ నేతృత్వం లోని ఐప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ, ప్రచార బాధ్యతలను చూస్తోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న తృణమూల్ అభ్యర్థులకు చెందిన పూర్తి వివరాలను రికార్డు చేస్తోంది. అందుకనే ఐప్యాక్ డేటాను కాజేయాలన్నదే ఈడీ లోపయికారీ ఉద్దేశం. ఐప్యాక్ కార్యాలయం పైన, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం పైనా ఈడీ దాడులు చేపట్టగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ..కోల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఐప్యాక్ డిజిటల్ , ఎలక్ట్రానిక్ రికార్డులు, స్టోరేజ్ మీడియా , ఇతర పత్రాలను తమకు అప్పగించేలా చూడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఐప్యాక్‌పై దాడుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాలు దుర్వినియోగం కాకుండా ఈడీని నియంత్రించాలని శుక్రవారం (9.1.26)తృణమూల్ కాంగ్రెస్ కూడా కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. రానున్న ఎన్నికల కోసం తమ పార్టీ సిద్ధం చేసుకున్న రహస్య రాజకీయ, ప్రచార వ్యూహాలు, అంతర్గత అంచనాలు, ఓటర్ల జాబితాల వివరాలు తదితర అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుందని టిఎంసీ పిటిషన్‌లో పేర్కొంది.

ఈ పత్రాలకు మనీలాండరింగ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.ఈ రెండు పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరగాల్సి ఉన్నా కోర్టు గదిలో లాయర్ల మధ్య తోపులాటలు, గందరగోళం ఏర్పడడంతో చివరికి జడ్జి శుభ్రాఘోష్ కోర్టును బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ఈ విచారణ జనవరి 14కి వాయిదా పడింది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు ఈ దాడులు జరగడం రాజకీయ కక్షగానే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపునకు తమిళనాడు సెన్సార్ బోర్డు వ్యవహారం తెరపైకి వచ్చింది. టివికె పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్ ’ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆ సినిమా విడుదల వాయిదా పడడం తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్‌డిఎ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్న సిబిఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల జాబితాలో తాజాగా సెన్సార్‌బోర్డు కూడా చేరడం తీవ్ర ఆక్షేపణీయంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ధ్వజమెత్తారు.

అంతేకాదు విజయ్‌కు ఆయన మద్దతుగా నిలిచారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా విజయ్‌కు మద్దతు పలికారు. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి విజయ్‌కు మూడు రోజుల క్రితం సిబిఐ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ చట్టం పరిధి లోకి రాని అంశాలపై ఈడీ కేసులు నమోదు చేయడం, ఆస్తులు జప్తు చేయడంపై గతంలో మద్రాస్ హైకోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకవర్గాల చేతిలో కీలుబొమ్మగా మారి విపక్ష నేతల పైనే ఈడీ దాడులు జరుగుతున్నాయని ఈడీ డొల్లతనాన్ని సాక్షాత్తు సుప్రీం కోర్టే గణాంకాల సాక్షిగా ఎండగట్టింది. బీజేపీ పాలనలో సిబిఐ, ఈడీ దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2004లో ఈడీ 112 దాడులు మాత్రమే చేయగా, 2022లో ఈ సంఖ్య 3010 కి అంటే 27 రెట్లు పెరిగింది.

మనీలాండరింగ్ కేసుల్లో ఎక్కువశాతం తగిన సాక్షాధారాలు ఈడీ సేకరించడంలో విఫలమవుతోందని సుప్రీం కోర్టు గతంలో తీవ్రంగా మందలించింది. అలాగే ఈడీ కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నమోదైనవే కావడం ప్రత్యేకించి గమనించ వలసి ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటి లోనూ నిష్కళంక హరిశ్చంద్రులే ఉన్నట్టు, విపక్ష రాష్ట్రాల పాలకులు అవినీతిపరులైనట్టు ఈదాడులు సాగుతుండడంలో ఆంతర్యం వివాదాస్పదమవుతోంది. 201424 మధ్యకాలంలో మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన 5297 కేసుల్లో 40 కేసులు మాత్రమే శిక్షలకు దారి తీశాయని అప్పటి కేంద్ర హోంశాఖ లోక్‌సభకు తెలియజేసింది. దీన్ని బట్టి ఈడీ సాగిస్తున్న దాడులు, దాఖలవుతున్న కేసులు ఎంతవరకు ఫక్కా సాక్షాలతో ఉంటున్నాయో ఈడీ విశ్వసనీయతను చాటి చెబుతున్నాయి. అలాగే చాలా కేసుల దర్యాప్తులో ఈడీ తనకున్న అసాధారణ అధికారాలతో దూకుడుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.