Reading Time: 3 minutes

విశ్వనగరం హైదరాబాద్ నగరానికి మణిహారమైన మూసీ నది సుందరీకరణ, పునరుజ్జీవం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ముందుకు సాగడం ముదావహము. ఎంతో ఘనమైన చరిత్ర గల మూసీ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ మురికికూపంగా మారిన వేళ నదికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో బృహత్ ప్రణాళికలను రూపొందించింది. మొదటి దశలో జాతిపిత మహాత్మా గాంధీ బాపుఘాట్ వరకు గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయనున్నట్టు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలతో పాటు పర్యావరణ వేత్తల్లో మూసీ పునర్వైభవంపై ఆశలు చిగురించాయి. మూసీ ప్రక్షాళనకు గత ప్రభుత్వాలు కూడా పలు సందర్భాల్లో చర్యలు తీసుకున్నా ఎప్పటికప్పుడు ఆటంకాలతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మిగిలిపోవడంతో ప్రస్తుత ప్రభుత్వ ప్రకటనతో త్వరలో మూసీ పరివాహ ప్రాంతాల్లో ఆహ్లాదరకమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

మురికికూపంగా మారిన మూసీ నది ప్రక్షాళన కోసం పర్యావరణ వేత్తలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని వనమూలికలకు నిలయమైన అనంతగిరి కొండల్లో పుట్టి ప్రవహించే మూసీ నది నీటిని తాగితే రోగాలు నయమవుతాయని గతంలో భావించగా, ఇప్పుడు మూసీ జలంతో పరిసరాల ప్రజలు రోగాల బారిన పడడం విచారకరం. అనంతగిరి కొండల నుండి ప్రారంభమై దాదాపు 267 కిలో మీటర్ల మేర ప్రయాణించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో ఈసీ, మూసా కలిసి మూసీ నదిగా ప్రయాణిస్తుంది. ప్రముఖ ఇక్ష్వాకుల వంశానికి చెందిన ముచుకుందుడనే రాజు రుషిగా మారిన అనంతరం ఆయన పేరు మీదనే ముచికుంద నది ఏర్పడిందని, అనంతరం అది మూసీగా మారిందనే కథనాలు కూడా ఉన్నాయి. మూసీ నది ప్రాశస్త్యం గురించి ప్రముఖ రచయిత ఏనుగుల వీరస్వామి తన ‘కాశీ యాత్ర చరిత్ర’లో ప్రస్తావిస్తూ ఈ నదిపై బ్రిటీష్ ప్రభుత్వం నిర్మించిన వంతెనపై ఒకేసారి ఏనుగులు నడిచినా చెక్కుచెదరకుండా ఉండేదని మూసీ వంతెన పటిష్టతను తెలియజేశారు. నది, జలం పుష్కలంగా ఉన్న ప్రాంతాలు నివాసానికి అనుకూలంగా ఉంటాయనే భావనతో మూసీ నది దక్షిణాన ప్రస్తుత పాతబస్తీలో గతంలోనే తెలుగు వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు స్థిరపడడంతో ఇప్పటికీ అక్కడి ప్రాంతాలు ఒక మినీ ఇండియాగా కనిపిస్తాయి.

ఘన చరిత్ర, నాగరికత కలిగిన మూసీ నది పరివాహంలో దాదాపు లక్ష ఎకరాల వరకు భూమి సాగయ్యేది. హైదరాబాద్ నగరానికి ప్రధాన జల వనరుగా ఉండేది. మూసీ పరివాహకంలో గతంలో అరుదైన చందమామ రకంతోపాటు 25 రకాల చేపలు జీవించేవి. 1908 సెప్టెంబర్ 26,27,28 తేదీల్లో మూసీకి భారీ వరదలు రావడంతో దాదాపు 15 వేల మంది వరకు చనిపోయారు. సుమారు 80 వేల మంది నిరాశ్రయులయ్యారు. అనంతరం మోక్షగుండం విశ్వశ్వరయ్య మార్గదర్శకంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను అప్పటి నిజాం ప్రభుత్వం నిర్మించింది. తర్వాత 1930, 1954, 1970, 2000, 2016, 2020, 2023 సంవత్సరాల్లో కూడా భారీ వర్షాలతో మూసీకి వరదలు వచ్చి నష్టం జరిగింది. గ్రేటర్ నగరంలో దాదాపు 70 కిలోమీటర్లకు పైగా ప్రవహించే మూసీ 400 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఆధునీకరణలో భాగంగా కబ్జాలకు గురవుతూ, పారిశ్రామిక వ్యర్థాలతో మురికికూపంగా మారిపోయి ప్రపంచవ్యాప్తంగా అత్యంతం కలుషితమైన నదుల్లో 22వ స్థానం దక్కించుకోవడం దురదృష్టకరం. గ్రేటర్ హైదరాబాద్ లో మురికిగా మారుతున్న మూసీ శివారు ప్రాంతాలతో పాటు నల్గొండ జిల్లాలోని ప్రాంతాలకు ప్రవహించే సమయానికి అత్యంత ప్రమాదకరంగా మారిపోవడంతో గ్రామీణ ప్రజలు నగరం నుంచి వస్తున్న విషతుల్యమైన కాలుష్యంతో ఇబ్బందులు పడడం విచారకరం.

చారిత్రాత్మకమైన మూసీ నది సుందరీకరణ, ప్రక్షాళన కోసం నిజాం కాలం నుండి ప్రారంభమైన ప్రయత్నాలు ప్రస్తుతం వరకు కొససాగుతున్నాయి. చివరి నిజాం హయాంలోనే మూసీ సుందరీకరణకు బీజం పడి ఆ కాలంలోనే నది పరివాహక ప్రాంతాల్లో 14 చోట్ల ఆహ్లాదకరమైన పార్కులను నిర్మించారు. నిజాం కాలం అనంతరం మూసీ ఆక్రమణలకు అడ్డులేక పోయింది. 1997లో తెలుగుదేశం ప్రభుత్వం నందనవందనం పేరుతో మూసీ సుందరీకరణ కోసం బాపుఘాట్ నుండి నాగోలు వరకు అభివృద్ధి పనులు చేపట్టినా 2001లో ఆగిపోయంది. 2005లో వైఎస్‌ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘సేవ్ మూసీ’ పేరిట రూ.330 కోట్లు మంజూరు చేసినా 2013 వరకు ముందడుగు పడలేదు. 2013లో నాలుగు ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 115 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.16 వేల కోట్లతో అంచనాలు రూపొందించి కొన్ని చోట్ల వాకింగ్ ట్రాకులు, పార్కులు, జిమ్ లు ఏర్పాటు చేయడంతో పాటు మురుగనీటి శుద్ధి కేంద్రాలను నిర్మించినా అక్కడ నిర్వహణ లోపంతో పాటు నాటి ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోకపోవడంతో మూసీ ప్రక్షాళన పట్టాలెక్కలేదు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ అభివృద్ధి కోసం అడుగులేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం రూ.1,500 కోట్లు కేటాయించింది. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మెయిన్ హర్ట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకొని, మొదటి దశలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుండి బాపూఘాట్ వరకు గాంధీ సరోవర్ పేరుతో 21 కిలోమీటర పనులను మార్చి నెలాఖరు నాటి కి ప్రారంభించి రేండేళ్లలో పూర్తి చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు ఏడీబీ రూ.4.1 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. బాపుఘాట్ గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు ఆయన మార్గదర్శక బోధనలకు అనుగుణంగా మ్యూజియం, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై గట్టి సంకల్పంతో ఉన్నారు. రాబోయే రెండేళ్లలో రూ.7 వేల కోట్లతో గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా చెప్పారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా నా ర్సింగ్, బాపుఘాట్, చార్మినార్, చాదర్‌ఘాట్, నాగోల్ జంక్షన్ల వద్ద ట్రంపెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మూసీ నదిలో కబ్జాలపై కఠినంగా ఉన్న ప్రభుత్వం ఇప్పటికే ‘హైడ్రా’ చే కొన్ని కట్టడాలు కూల్చివేసిన ప్రభుత్వం ఎంతటివారినైనా వదిలేదని లేదని హెచ్చరించింది. అదే సమయంలో పేద ప్రజలు కూల్చివేతలతో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వారికి పునరావాసం ఏర్పాటు చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగవంతంగా తీసుకుంటున్న పలు చర్యలతో మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై ప్రజలు ఎంతో ఆశాదృక్పథంతో ఉన్నారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం నీటి వనరులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ ప్రపంచ నదుల దినోత్సవం నిర్వహిస్తారు. రాబోయే నదుల దినోత్సవం నాటికి మూసీ ప్రక్షాళన గాడిలో పడితే ప్రజల్లో ఆశలు రెట్టింపవుతాయి. లండన్‌లో థేమ్స్ నది, సియోల్‌లో చియోంగ్ జియోన్ నది కూడా మూసీ నది వలే మురికితో ప్రమాదకరంగా మారిన దశలో వాటిని ప్రక్షాళించగా ఇప్పుడవి ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మన దేశంలో కూడా గంగా, సబర్మతి, యమున, ములముత, భగల్‌పూర్ వంటి నదులను సుందరీకరించారు. ఇదే తరహాలో మూసీ నది ప్రక్షాళన పూర్తి చేయాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

బృహత్ నగరంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ అవసరాలతో పాటు పరివాహక ప్రాంతాల్లో పచ్చని పంటల కోసం మూసీ నది పునర్జీవనం ఆవశ్యకత ఉంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నించింది. ఆ సమయంలోనే ప్రస్తుత కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా మూసీ సుందరీకరణ కోసం డిమాండ్ చేస్తూ ఆ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ప్రమాదకరంగా మారిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి కోసం పార్టీలన్నీ కలిసి రావాలని ప్రజలు, పర్యాటకవేత్తలు కోరుతున్నారు. మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం వేగవంతమైన చర్యలతో ముందుకొస్తుండడంతో మూసీ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

– ఐ.వి.మురళీకృష్ణ శర్మ

సీనియర్ జర్నలిస్టు