Reading Time: 2 minutes

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ ముగిసింది. ఈ ప్రీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని భట్టి కోరారు. కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘‘దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మర్చాలనే కేంద్ర లక్ష్యాన్ని అభినందిస్తున్నా. దేశ జిడిపిలో తెలంగాన వాటా 5.1 శాతం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించాం. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. దేశ జిడిపిలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని అన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడి రేటును జిఎస్‌డిపిలో పెంచాలని భట్టి కోరారు. ‘‘పెట్టుబడి రేటును 37 శాతం నుంచి 50 శాతానికి జిఎస్‌డిపిలో పెంచాలి. రాష్ట్రాల ద్రవ్య లోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతం పెంచాలి. 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చి.. సహాయాన్ని రెట్టింపు చేయాలి. విద్య, వైద్య రంగాల కోసం సేకరించే వనరులను ఎఫ్‌ఆర్‌బిఎం నుంచి మినహాయించాలి. రాష్ట్రంలో వెయ్యికి పైగా కులాల వారీగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను’ ఏర్పాటు చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం.. 20 శాతం కంటే ఎక్కువ రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోంది. 25 శాతం తగ్గించి.. రూ.2.21 లక్షల కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేయాలి’’ అని అన్నారు.

‘‘ప్రస్తుతం సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరింది. 15వ ఆర్థిక సంఘం 41 శాతం పన్ను బదిలీని సిఫార్సు చేసినప్పటికీ 30 శాతమే అందుతోంది. ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాం. హైదరాబాద్ మెట్రో రెండో దశపై త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులివ్వాలి. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు మంజూరు చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ హోదాతో గుర్తించాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ.14,100 కోట్లు కేటాయించాలి. రేడియల్ రోడ్ల కోసం రూ.45,000 కోట్లు కేటాయించాలి. హైదరాబాద్ మురుగు నీటి పారుదల ప్రణాళిక కోసం రూ.17,212 కోట్లు కేటాయించాలి. సహకార సమాఖ్య స్పూర్తితో ప్రతిపాదనలపై సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నా’’ అని భట్టి పేర్కొన్నారు.