Reading Time: < 1 minute

తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ షో, టిక్కెట్ల ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీనిపై విజయ్ గోపాల్ అనే న్యాయవాది శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు నిరాకరించిన ధర్మాసనం కోర్టు పనిదినాల్లోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. సినిమా టిక్కెట్ల ధరలు నిబంధనలకు విరుద్దంగా పెంచుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేయాలని కోరారు. హౌస్‌మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతించకపోవడంతో న్యాయవాది విజయ్‌గోపాల్ ఈ నెల 19వ తేదీన మరోసారి

పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, మన శంకర్ వరప్రసాద్‌గారు సినిమా టిక్కెట్ల ధరలు పెంచాలని నిర్మాతలు సాహుగారపాటి, సుస్మిత కొణిదెల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ టిక్కెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోలు నిర్వహించుకునేందుకు జీఓ జారీ చేసింది. ఈ నెల 11వ తేదీకి స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతిస్తూ ధరను రూ.600(పన్నులతో కలిపి)గా నిర్ణయించింది. దీంతో పాటు ఈ నెల 12వ తేదీ నుండి ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ రూ.50 (పన్నులతో), మల్టీప్లెక్స్‌లలో రూ. 100(పన్నులతో) ధరలు పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.