Reading Time: < 1 minute
Cm Revanth Reddy Indiramma Housing Scheme Kphb Land Registration

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి KPHB కాలనీలో ప్రసంగిస్తూ ఇళ్ల నిర్మాణం, భూక్రమబద్ధీకరణపై ప్రజలకు హామీ ఇచ్చారు. భూమికి సంబంధించిన డబ్బులు ఏమీ తీసుకోవడం లేదని, ఇల్లు పూర్తయిన తర్వాత మాత్రమే రూ. 5 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. 22A నిబంధనల కింద ఉన్న భూములకు తనదే పూర్తి భరోసా అని, కోర్టు కేసులు ఉన్నవి మినహా మిగిలిన భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కూకట్‌పల్లిని ప్రత్యేకంగా చూసి అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా తనను ఎంపీగా గెలిపించిన కూకట్‌పల్లి ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే హౌసింగ్ బోర్డు కాలనీలు నిర్మితమయ్యాయని గుర్తుచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన ఆయన.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఊరవతల ఇళ్లు కట్టి ప్రజలను ఉపాధికి దూరం చేశారని ధ్వజమెత్తారు. పదేళ్ల కేసీఆర్ పాలనకు, తమ ప్రభుత్వం పూర్తి చేసిన పనులకు మధ్య ఉన్న తేడాను ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు గానూ తమ ప్రభుత్వం నెలకు రూ. 7 వేల కోట్లు వడ్డీలు కడుతోందని వెల్లడించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరలు, సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు పాలనా సేవలు ఇబ్బంది లేకుండా GHMCని మూడు భాగాలుగా విభజించామని చెప్పారు. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా ఎదుర్కొంటానని, ప్రజలు అండగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.