
ఒక పేద రైతు.. చెమట కష్టం అంతా పంట పెట్టుబడులకు, అప్పులు, వడ్డీలకే సరిపోతున్న పరిస్థితుల్లో.. ఇలా అయితే ఇల్లు కట్టుకునేది ఎలా అని ఉన్న ప్లాట్ అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బు మరింత జమ అయ్యే లోపు దాచుకుందాం అని.. తన చెలకలో గుంత తోడి కవర్లతో ప్యాక్ చేసి ఓ డబ్బాలో పెట్టి.. పాతిపెట్టాడు. అదే పొలంలో సొంత ఇల్లు కట్టుకుందాం అనుకున్న కలలన్నీ కల్లలయ్యేలా.. దాచుకున్న డబ్బు అంతా చెదలు పట్టడం ఆ రైతుకు కన్నీళ్లు తెప్పించింది.
రాజస్థాన్ లోని బలోత్ర జిల్లాలోని నెవాయి గ్రామంలో జరిగింది ఈ ఘటన. మంగిలాల్ మేఘవాల్ అనే రైతు.. పచపద్ర దగ్గర ఉన్న ఒక ప్లాట్ అమ్మేసి.. ఆ డబ్బును ఇల్లు కట్టుకునేందుకు చెలకలో దాచుకున్నాడు. చెదలు పట్టి పోవడంతో షాకయ్యాడు. అయితే కష్టపడి సంపాదించిన ఐదు లక్షల రూపాయలు కోల్పోయిన రైతుకు న్యాయం జరిగేదెలా..? చెదలు పట్టిన నోట్లకు బదులు బ్యాంకు కొత్త నోట్లు ఇస్తుందా..? రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
పొలం అంతా వెతికిన కుటుంబం..
పాతిపెట్టిన డబ్బును ఇల్లు కట్టుకునే ప్లాన్ లో భాగంగా తీసుకుందాం అని వెళ్లిన రైతు చాలా టెన్షన్ పడాల్సి వచ్చింది. పాతి పెట్టిన చోట డబ్బు కనిపించకపోవడంతో ఎవరైనా కొట్టేశారా అని ఒకటే టెన్షన్ పడ్డాడట. చివరికి కుటుంబ సభ్యులకు చెబితే.. భార్య, కొడుకు తో కలిసి దాదాపు మూడున్నర ఎకరాల పొలంలో అణువణువు వెతికారట. ఎక్కడా డబ్బు దొరకలేదట. దీంతో ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని ఆశలు వదులుకున్నారట.
ఏడాది పాటు.. చెదలపాలు:
డబ్బు పొయిందని ఆశలు వదులుకున్న కుటుంబం.. ఎప్పటిలాగే పంట వేసేందుకు సిద్ధమైందట. వర్షం పడటంతో పొలం అంతా దున్నేశారట. దున్నే సమయంలోనే పాలిథీన్ కవర్ బ్యాగ్ మట్టి నుంచి కొంత తేలిందట.. కానీ అది రాత్రి సమయం కావటంతో గుర్తించలేకపోయారు.
తెల్లారే పొలానికి ఫెన్సింగ్ వేస్తుండగా కవర్ కనిపించి సంతోష పడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు ఉండలేదు. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే.. 500 నోట్లలో చాలా వరకు చెదలు పట్టి డ్యామేజ్ అయిపోయాయట. చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయట.
బ్యాంకులు కొత్త నోట్లు ఇస్తాయా..?
బ్యాంకులో కొత్త నోట్లు వస్తాయేమోననే చిన్న ఆశతో పచపద్రలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు వెళ్లారట. ఎంతో కొంత వచ్చినా చాలు అనుకున్నారట. కానీ.. చినిగిపోయి.. డ్యామేజ్ అయిన నోట్లకు బదులు ఇచ్చేది లేదని బ్యాంకు అధికారులు చెప్పారట.
దీంతో బలోత్రలోని మెయిన్ బ్రాంచ్ కు వెళ్లగా.. అక్కడ కూడా అదే పరిస్థితి. చెదలు తిన్న డబ్బుకు తిరిగి ఇచ్చేది కుదరదని చెప్పడంతో వాళ్ల ఆశలు అడియాశలయ్యాయి. పాపం ఆ రైతు దాచుకున్న ఐదు లక్షల రూపాయలు చెదలపాలు అవ్వడంతో కన్నీరుమున్నీవుతున్నారు.