Reading Time: 2 minutes
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి.. ఈ బిస్కెట్ హిస్టరీ మామూలుగా లేదుగా..

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు, యోధులు గుర్తుకొస్తారు. అయితే వారితో పాటు బ్రిటీష్ సామ్రాజ్యపు ఆర్థిక మూలాలను దెబ్బతీసి, విదేశీ బ్రాండ్లకు సవాలుగా నిలిచిన కొన్ని భారతీయ కంపెనీలను కూడా మనం గుర్తుచేసుకోవాలి. అందులో మొదటిగా గుర్తుకువచ్చే పేరు పార్లే జి. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో, సామాన్య భారతీయుడికి రుచి స్వేచ్ఛను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ బ్రాండ్.. నేడు ప్రతి భారతీయ ఇంటిలో ఒక భాగమైపోయింది. పార్లే జి వ్యవస్థాపకుడు మోహన్ లాల్ దయాల్. 1929లో స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో స్వదేశీ ఉద్యమ పిలుపుతో ప్రభావితుడైన మోహన్ లాల్ ఒక భారతీయ కంపెనీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ముంబైలోని ఇర్లా, పార్లా ప్రాంతాల సరిహద్దులో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీలో దీనిని ప్రారంభించారు. ప్రాంతం పేరు మీదుగా పార్లే ఇన్ పార్లా అని పేరు పెట్టారు. విశేషమేమిటంటే.. ఈ కంపెనీ కోసం ఆయన బయటి వారిని కాకుండా తన సొంత కుటుంబంలోని 12 మంది సభ్యులనే మొదటి ఉద్యోగులుగా నియమించుకున్నారు.

జర్మనీ నుంచి యంత్రం.. క్యాండీలతో శ్రీకారం

ఆ రోజుల్లో మిఠాయిలను విదేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. అవి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. భారతీయులకు సరసమైన ధరలో మిఠాయిలు అందించాలనే తపనతో మోహన్ లాల్ జర్మనీ వెళ్లి.. రూ.60,000 వెచ్చించి మిఠాయి తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. అలా నారింజ రంగు క్యాండీల తయారీతో పార్లే ప్రయాణం మొదలైంది.

బ్రిటీష్ బిస్కెట్లకు గట్టి దెబ్బ..

అప్పట్లో బిస్కెట్లు తినడం అనేది కేవలం బ్రిటీష్ వారికి మాత్రమే ఉన్న ప్రత్యేక హక్కుగా భావించేవారు. బ్రిటానియా, గ్లాక్సో, యునైటెడ్ బిస్కెట్స్ వంటి విదేశీ బ్రాండ్లు అధిక ధరలకు బిస్కెట్లను విక్రయించేవి. దీనిని సవాలు చేస్తూ మోహన్ లాల్ 1939లో అతి తక్కువ ధరలో, నాణ్యమైన పార్లే గ్లూకోజ్ బిస్కెట్లను మార్కెట్లోకి తెచ్చారు. మొదటిసారిగా సామాన్య భారతీయుడు బిస్కెట్ రుచి చూడటం ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి కూడా ఈ బిస్కెట్లను సరఫరా చేయడంతో పార్లే తిరుగులేని శక్తిగా మారింది. అనంతరం 1940లో మొనాకో పేరుతో ఉప్పు బిస్కెట్లను కూడా ప్రవేశపెట్టారు.

దేశ విభజన సంక్షోభం.. బార్లీతో నయా రూట్

స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశ విభజన కారణంగా తీవ్ర గోధుమల కొరత ఏర్పడింది. దాంతో బిస్కెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్న మోహన్ లాల్.. గోధుమలకు బదులుగా బార్లీ ఉపయోగించి బిస్కెట్లను తయారు చేయడం ప్రారంభించి మార్కెట్లో తన వేగాన్ని తగ్గనివ్వలేదు.

నకిలీల జోరు.. పసుపు కవర్, చిన్నారి బొమ్మతో రీబ్రాండింగ్..

పార్లే బిస్కెట్లకు వచ్చిన ఆదరణ చూసి బ్రిటానియా వంటి బ్రిటీష్ కంపెనీలు కూడా గ్లూకోజ్ డి పేరుతో కాపీ చేయడం మొదలుపెట్టాయి. ఈ పోటీని తట్టుకోవడానికి పార్లే తన పేరును పార్లే జి గా మార్చింది. పసుపు రంగు చారల ప్యాకింగ్, ప్యాకెట్‌పై ఒక చిన్న అమ్మాయి బొమ్మతో సరికొత్త లోగోను డిజైన్ చేసింది. 50 ఏళ్ల పాటు కేవలం నోటి ప్రచారంతో నడిచిన పార్లే జి, 1982లో దూరదర్శన్‌లో స్వద్ భరే శక్తి భరే, పార్లే జి శక్తిమాన్ ప్రకటనతో టీవీల్లోకి అడుగుపెట్టింది. 2000వ సంవత్సరంలో గ్లూకోజ్ సూచించే G అక్షరాన్ని జీనియస్ అని రీబ్రాండ్ చేశారు.

రూ.1 లక్ష కోట్ల విలువైన గ్లోబల్ బ్రాండ్..

ఒకప్పుడు జర్మనీ యంత్రంతో చిన్నగా ప్రారంభమైన పార్లే, నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్‌గా నిలిచింది. చైనాలోని మొత్తం బిస్కెట్ బ్రాండ్ల విక్రయాల కంటే పార్లే-జి ఒక్కటే భారతదేశంలో ఎక్కువ బిస్కెట్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం పార్లే-జి వార్షిక టర్నోవర్ సుమారు రూ.17,000 కోట్లు కాగా, 50కి పైగా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. దేశవ్యాప్తంగా 130 తయారీ యూనిట్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానప్పటికీ.. ఈ రోజు పార్లే కంపెనీ విలువ సుమారు రూ.1 లక్ష కోట్లు ఉంటుందని అంచనా. ఒక స్వదేశీ కలగా మొదలై, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని శాసించిన పార్లే జి ప్రయాణం నిజంగా ప్రశంసనీయం.