Reading Time: 2 minutes
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటలు మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నర్సిపట్నం, ఏలమంచిలి, తల్లపాలెం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.

ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.