Reading Time: 3 minutes
Mecca Pact New Muslim Alliance In Middle East Explained

Mecca pact Explained: ఒక రాత్రి ప్రపంచ పటం మీద కొన్ని గీతలు మెల్లగా కదిలాయి. మక్కా నగరంలో మూడు దేశాలు ఒకే గొడుగు కింద నిలబడ్డాయి. ఆ గొడుగు కింద డబ్బు ఉంది.. సైన్యం ఉంది.. ఆయుధాలు ఉన్నాయి.. అణుశక్తి ఉంది. కానీ ఆకాశంలో కనిపించని మరో విషయం ఉంది.. అదే భయం..!

అమెరికా నీడలో దశాబ్దాలుగా నిద్రించిన మధ్యప్రాచ్యం.. ఇప్పుడు తనకంటూ ఒక కొత్త కవచాన్ని తయారు చేసుకుంటోందా? ఆ కవచం రేపు మరిన్ని దేశాలను తనలోకి లాగితే.. దాని నీడ ఎక్కడివరకు వెళ్తుంది? ఈ కథ మక్కాలో మొదలైంది కానీ దాని ప్రతిధ్వని భారత్ వరకు వినిపించే అవకాశం ఉందా?

పాకిస్థాన్.. సౌదీ అరేబియా.. టర్కీ. మూడు దేశాలు. మూడు రకాల శక్తులు. సౌదీ దగ్గర అపారమైన ఆర్థిక బలం ఉంది. టర్కీ దగ్గర నాటో అనుభవంతో పెరిగిన సైనిక శక్తి, డ్రోన్లు, ఆయుధ తయారీ సామర్థ్యం ఉంది. పాకిస్థాన్ దగ్గర లక్షలాది సైనికులు.. వాటితో పాటు అణ్వాయుధ సామర్థ్యం ఉంది. ఈ మూడు శక్తులు ఒకే వలయంలోకి వచ్చినప్పుడు.. అది ఒక సాధారణ ఒప్పందంలా కనిపించినా, దాని వెనుక ఏర్పడే సమీకరణం మాత్రం చాలా పెద్దది.

మక్కాలో కుదిరిన ఈ రక్షణ ఒప్పందం పరిధి ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. టర్కీ వైపు నుంచి ఇప్పటికే ఈ గొడుగు మరిన్ని దేశాలకు విస్తరించాలనే సంకేతాలు వచ్చాయి. మొదట ఈజిప్ట్ పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత ఖతార్.. కువైట్.. జోర్డాన్.. అజర్‌బైజాన్.. సిరియా. ఒక్కో దేశం ఈ వలయంలోకి వస్తే.. మధ్యప్రాచ్య పటం మీద కొత్త సైనిక బంధం నెమ్మదిగా రూపం మార్చుకుంటుంది. ఇక్కడే ఈ కథలో అత్యంత భయపెట్టే విషయం దాగి ఉంది. ఈ ఒప్పందంలోని సూత్రం ప్రకారం.. ఒక సభ్యదేశంపై సాయుధ దాడి జరిగితే, అది మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే విధానం ఉంటుంది.

అంటే ఒక ప్రాంతంలో మొదలైన మంట.. మరో దేశ సరిహద్దు దాటడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఒక మిసైల్ ఒక దేశాన్ని తాకితే.. దాని ప్రతిస్పందన మరొక దేశం నుంచి రావచ్చు. ఆ తర్వాత ఇంకో దేశం కదలవచ్చు. ఇలా ఒక చిన్న చిచ్చు.. ఒక పెద్ద యుద్ధంగా మారే మార్గం అక్కడే మొదలవుతుంది.

అయితే ఈ కూటమి పుట్టిన సమయం మరింత ఆసక్తికరం. ఇరాన్ దాడులతో మధ్యప్రాచ్యంలో అమెరికా భద్రతా వ్యవస్థపై ఉన్న నమ్మకానికి గట్టి దెబ్బ పడింది. అమెరికా రక్షణ వ్యవస్థలు ఎన్నో మిసైళ్లు, డ్రోన్లను అడ్డుకున్నా.. కొన్ని దాడులు సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను తాకాయి. గల్ఫ్ దేశాలకు ఒక భయంకరమైన నిజం అర్థమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం తమ పక్కన ఉన్నా.. యుద్ధం మొదలైతే దాని మంటల నుంచి పూర్తిగా తప్పించుకోవడం అంత సులభం కాదు.

అక్కడే అమెరికాపై ఆధారపడిన పాత భద్రతా వ్యవస్థకు అల్టెర్‌నెట్‌ వెతకాల్సిన ఆలోచన బలపడింది. దశాబ్దాలుగా అమెరికా సైనిక స్థావరాలు మధ్యప్రాచ్యానికి ఒక రక్షణ గోడలా కనిపించాయి. ఇప్పుడు ఆ గోడకు అవతల నుంచి మిసైళ్లు దూసుకొస్తున్నాయి. ఆ గోడ మీద నమ్మకం తగ్గుతున్న కొద్దీ.. లోపల ఉన్న దేశాలు తమ చేతులతోనే మరో గోడ కట్టుకోవాలని చూస్తున్నాయి. ఈజిప్ట్ ఈ కూటమిలోకి అడుగుపెడితే ఆ గోడ మరింత ఎత్తుగా మారుతుంది. 4.4 లక్షలకు పైగా యాక్టివ్ సైనిక బలం.. భారీ ట్యాంకులు.. వైమానిక దళం.. నౌకాదళం.. ఆసియా, ఆఫ్రికా మధ్య కీలక భౌగోళిక స్థానం.. సుయెజ్ కాలువకు సమీపం. ఈజిప్ట్ చేరికతో కూటమికి సైనిక బలం పెరుగుతుంది.

ఖతార్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలు చేరితే ఆర్థిక శక్తి మరింత పెరుగుతుంది. జోర్డాన్, సిరియా, అజర్‌బైజాన్ లాంటి దేశాలు చేరితే ఈ కూటమి అడుగులు మధ్యప్రాచ్యం దాటి మరింత విస్తరించే అవకాశం ఉంటుంది.

అప్పుడు మక్కాలో మొదలైన ఆ చిన్న వలయం.. ఒక పెద్ద భౌగోళిక భద్రతా వ్యవస్థగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మరో చీకటి ప్రశ్న తలెత్తుతుంది. ఈ మార్పు నిజంగా అమెరికా నుంచి మధ్యప్రాచ్యం దూరమవుతున్న సంకేతమా? లేదా అమెరికానే తన మిత్రదేశాలను తమ రక్షణ బాధ్యతను తామే మోసేలా ప్రోత్సహిస్తోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలు తమ రక్షణ కోసం మరింత ఖర్చు చేయాలని కోరుతున్న సమయంలోనే ఈ కొత్త కూటమి పుట్టడం.. అనేక అనుమానాలకు తలుపులు తెరుస్తోంది. మరోవైపు మరో అనుమానం మరింత ప్రమాదకరంగా వినిపిస్తోంది.

ఈ ఒప్పందం వెనుక ఇరాన్‌ను చుట్టుముట్టే పెద్ద వ్యూహం దాగి ఉందా? పాకిస్థాన్‌లోని కొందరు షియా మతపెద్దలు ఇప్పటికే దీన్ని అమెరికా, అరబ్ దేశాల కుట్రగా అనుమానిస్తున్నారు. అదే సమయంలో కూటమిలో ఉన్న దేశాలు మాత్రం తమ లక్ష్యం రక్షణ మాత్రమేనని చెబుతున్నాయి. కానీ చరిత్రలో ఎన్నో పెద్ద సైనిక బంధాలు కూడా మొదట చిన్న రక్షణ ఒప్పందాల రూపంలోనే మొదలయ్యాయి.

ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్క విషయం. పాకిస్థాన్ దగ్గర అణుశక్తి.. టర్కీ దగ్గర రక్షణ సాంకేతికత.. సౌదీ దగ్గర అపారమైన ఆర్థిక బలం.. దానికి ఈజిప్ట్ సైన్యం.. గల్ఫ్ దేశాల సంపద.. మరిన్ని దేశాల భౌగోళిక బలం కలిస్తే.. మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి కేంద్రం పుడుతుంది. ఆ శక్తి ఎటు తిరుగుతుందో ఇప్పుడే ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నెమ్మదిగా స్పష్టమవుతోంది.

మక్కాలో వెలిగిన ఈ చిన్న మంట.. ఒక ఒప్పందం కాగితాలకే పరిమితమైతే కథ అక్కడితో ముగుస్తుంది. అది దేశం తర్వాత దేశాన్ని తనలోకి లాగితే.. మధ్యప్రాచ్యం మొత్తం తన భద్రతా పటాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. అప్పుడు ప్రశ్న అమెరికా గురించో.. ఇరాన్ గురించో మాత్రమే ఉండదు. ప్రశ్న భారత్ చుట్టూ మారుతున్న భద్రతా సమీకరణాల గురించి కూడా ఉంటుంది. ఎందుకంటే పాకిస్థాన్ ఇప్పటికే ఈ వలయంలో ఉంది. అరేబియా సముద్రం ఈ దేశాల మధ్య కీలకమైన మార్గం. గల్ఫ్ ప్రాంతం భారత ఇంధన అవసరాలకు అత్యంత కీలకం.

ఆ ప్రాంతంలో ఒక కొత్త సైనిక కూటమి బలపడితే.. దాని అలలు సముద్రం దాటి భారత్ తీరాల వరకు రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మక్కాలో మూడు దేశాలు చేతులు కలిపాయి. ప్రపంచం దాన్ని ఒక ఒప్పందంగా చూస్తోంది. కానీ చరిత్ర కొన్నిసార్లు ఒప్పందాల మధ్యలోనే భవిష్యత్తు యుద్ధాల నీడలను దాచిపెడుతుంది. ఆ నీడ ఇప్పుడు ఎంత పెద్దదవుతుందో.. ఈ గొడుగు కిందకి రేపు ఎన్ని దేశాలు వస్తాయో అన్నదే అసలు కథ.