Reading Time: < 1 minute
Up Women Rs 50000 Yogi Government Cash Transfer Welfare Schemes

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తన పథకాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం మహిళలకు రూ. 50,000 వరకు ఆర్థిక సాయం అందించాలని యోచిస్తోంది. అయితే, ఈ మొత్తాన్ని ఒకేసారి నగదు రూపంలో ఇవ్వాలా? లేక ఇప్పటికే అమలులో ఉన్న మహిళా సంక్షేమ పథకాలను విస్తరించి వివిధ రూపాల్లో ప్రయోజనం కల్పించాలనా? అనే ఆలోచన చేస్తోంది.

అర్హత కలిగిన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా నగదు జమ చేయాలనే ఒక ప్రతిపాదన ఉంది. మరో మార్గంగా విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు సంబంధించిన పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. రూ. 50,000 మొత్తాన్ని ఒకేసారి నగదు రూపంలో ఇవ్వకుండా, ఇప్పటికే అమలులో ఉన్న మహిళా సంక్షేమ పథకాలను మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.

యూపీలో అమలు అవుతున్న మహిళా సంక్షేమ పథకాలు ఇవే:

*ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన: పుట్టుక నుంచి విద్యలో వివిధ దశలు, గ్రాడ్యుయేషన్ వరకు అర్హత కలిగిన బాలికలకు మొత్తం రూ.15,000 వరకు ఆర్థిక సాయం.

*రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కూటర్లు అందించే లక్ష్యంతో ఉన్న పథకం.

*నిరాశ్రిత మహిళా పెన్షన్ యోజన: అర్హత కలిగిన నిరాశ్రయ మహిళలు, వితంతువులకు జీవనోపాధి కోసం ప్రతి మూడు నెలలకు రూ.3,000 సాయం.

*రాణి లక్ష్మీబాయి మహిళా ఏవం బాల్ సమ్మాన్ కోష్: యాసిడ్ దాడులు సహా తీవ్రమైన హింసకు గురైన మహిళలు, పిల్లలకు చికిత్స, పునరావాసం కోసం ఆర్థిక సాయం.

*ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన: పేద, నిరాశ్రయ కుటుంబాల కుమార్తెలు, వితంతు మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం.

*స్వయం సహాయక సంఘాలు, లఖ్‌పతి దీదీ: మహిళలను స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, జీవనోపాధి అవకాశాలతో అనుసంధానించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం.

*యూపీ రోడ్‌వేస్ ఉచిత ప్రయాణం: 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.