Reading Time: 2 minutes
Ind Vs Sl 1st Test Sri Lanka Squad Announced New Faces Get Chance

Sri Lanka squad for 1st Test: భారత్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తొలి టెస్టు కోసం జట్టును ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు శ్రీలంక బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. అయితే కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో శ్రీలంక జట్టుకు ధనంజయ డి సిల్వా నాయకత్వం వహించనున్నాడు. లంక బోర్డు రెండు టెస్టుల సిరీస్‌కు ఒకేసారి జట్టును వెల్లడించకపోవడం గమనార్హం.

కమిందు మెండిస్ తొలి టెస్టులో ధనంజయ డి సిల్వాకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. స్వదేశంలో జరిగే సిరీస్‌ను విజయంతో ప్రారంభించేందుకు శ్రీలంక జట్టు ఉత్సాహంగా ఉంది. తొలి టెస్టు జట్టులో కసున్ రాజిత, ఇసిత విజేసుందర వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కలేదు. మరోవైపు గాయాల కారణంగా కొందరు కీలక ఆటగాళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో శ్రీలంక జట్టు కూర్పుపై ప్రభావం పడింది. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరిసారిగా శ్రీలంక తరపున ఆడిన నిరోషన్ డిక్వెల్లా.. ఇప్పుడు తిరిగి టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బ్యాటర్ పసిందు సూరియబండార కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత రికార్డు ఉన్న కుడిచేతి వాటం ఆఫ్-స్పిన్నర్ కేశర నువాంత కూడా జట్టులో ఉన్నాడు. నువాంత టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 2023లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే టెస్టు మ్యాచ్ ఆడిన ఎడమచేతి వాటం పేసర్ దిల్షాన్ మదుశంకను తిరిగి జట్టులోకి వచ్చాడు. మొత్తంగా లంక పటిష్టంగా ఉంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య శ్రీలంకలో టెస్టు సిరీస్ జరిగి దాదాపు తొమ్మిదేళ్లు అవుతోంది. చివరిసారిగా 2017లో భారత్ శ్రీలంకలో పర్యటించింది. అప్పట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

భారత్ వంటి బలమైన జట్టుతో స్వదేశంలో తలపడుతున్న నేపథ్యంలో శ్రీలంకకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా గాలే పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో.. బ్యాటర్లతో పాటు శ్రీలంక స్పిన్ విభాగంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. భారత్, శ్రీలంక జట్లు కొత్త తరం ఆటగాళ్లతో తొమ్మిదేళ్ల మరోసారి టెస్టు సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టులో శ్రీలంక తన హోమ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తుండగా.. భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల రేసులో కీలకమైన విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది.

తొలి టెస్టుకు శ్రీలంక జట్టు:
ధనంజయ డి సిల్వా, లాహిరు ఉదానా, నిషాన్ మదుష్క, కమిందు మెండిస్, దినేష్ చండిమాల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయక్, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షన్ మదుశంక.