Reading Time: 3 minutes
Mecca Pact Explained Pakistan New Strategy

అణ్వాయుధాలను చూపిస్తూ దశాబ్దాలుగా సాగించిన భయానక బ్లాక్‌మెయిల్ ఇక చెల్లదని తేలిపోయింది. భారత దృఢమైన వైఖరి ముందు ముందు పాకిస్తాన్ పాచికలు చెల్లవని అర్థమైపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇస్లామాబాద్ హడలిపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ కొత్త గేమ్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. అదే మక్కా ఒప్పందం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సౌదీ అరేబియా, డిఫెన్స్ టెక్నాలజీలో ముందంజలో ఉన్న టర్కీలతో కలిసి రాత్రికి రాత్రే సంతకం చేసిన ఆ రహస్య ‘మక్కా ఒప్పందం’ వెనుక అసలు కథేంటి?

ఆర్థిక సంక్షోభంలోనో, భద్రతా సంక్షోభంలోనో కూరుకుపోయిన ప్రతిసారి విదేశీ పర్యటనల పేరిట వ్యూహాత్మక భాగస్వామిని వెతుక్కోవడం పాకిస్తాన్ నాయకులకు అలవాటైన విద్య. 1972 జనవరిలో, భారత్‌తో జరిగిన యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఆ పరాభవం తర్వాత నాటి అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఇరాన్, సౌదీ అరేబియా, లిబియా దేశాల్లో సుడిగాలి పర్యటన చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తమ అణుబాంబు ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వాలంటూ ఆయా దేశాలను వేడుకున్నారు. ఆ పర్యటనలో ఏర్పడిన సంబంధాలే పాకిస్తాన్ అణు కార్యక్రమాలకు బీజం వేశాయి. ‘డిసెప్షన్’ అనే పుస్తకంలో రచయితలు ఏడ్రియన్ లెవీ, కేథరిన్ స్కాట్-క్లార్క్ ఈ విషయాన్ని వెల్లడించారు.

నేడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ల నేతృత్వంలోని హైబ్రిడ్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. కూలిపోతున్న తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు వీళ్లిద్దరూ దేహీ అంటూ సౌదీ అరేబియా శరణుకోరారు. ఆ క్రమంలోనే ఆగస్టు 7న ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లు కలిసి ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పై సంతకాలు చేశారు. నాటో తరహాలోనే ‘ఒకరిపై దాడి జరిగితే అందరిపై జరిగినట్లే’ అన్న ప్రతిపాదనతో ఈ త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు.

ఇన్నాళ్లూ అమెరికాను నమ్ముకున్న సౌదీ అరేబియాకు ఇరాన్ వార్ కళ్లు తెరిపించింది. ఇరాన్ ను కట్టడి చేయాలంటే కొత్త మిత్రులను వెతుక్కోవాల్సిన పరిస్థితి సౌదీ అరేబియాకు ఏర్పడింది.

అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడులను తట్టుకుని ఇరాన్ నిలబడింది. ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం వాటా కలిగిన కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ను మూసివేసి ప్రపంచదేశాలకు ఇరాన్ సవాలు విసిరింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత వెలిసిన డజనుకు పైగా యుఎస్ మిలిటరీ స్థావరాలు ఇరాన్ దాడులకు గురయ్యాయి. 6 GCC రాచరికాలకు రక్షణ ఇవ్వడంలో అమెరికా విఫలమైంది. దీంతో సౌదీ అరేబియా తన వ్యూహాన్ని మార్చుకోక తప్పలేదు.

అయితే పాకిస్తాన్ కోణం వేరు. కేవలం భారత్‌ను దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ కొత్త మిత్రులను వెతుక్కుంటోంది. 1990ల నుంచి పాకిస్తాన్ నిర్మించుకున్న అణ్వాయుధ ఆధారిత ఉగ్రవాద కవచాన్ని గతేడాది మే నెలలో భారత్ తునాతునకలు చేసింది. 1979లో జియా ఉల్ హక్ చేతిలో భుట్టో హత్యకు గురయ్యాక, పర్వేజ్ ముషారఫ్ వంటి నియంతలు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్నారు.

అణు యుద్ధం వస్తుందనే భయంతో భారత్ మిలిటరీ దాడి చేయదని భావించారు. కానీ 2025 ఏప్రిల్‌లో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది పౌరులను దారుణంగా హత్య చేసినప్పుడు భారత్ సహనం నశించింది. 2025 మే 7న భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. PAF ఫైటర్ జెట్లు పశ్చిమ దిశగా పారిపోయాయి. మునీర్ నాయకత్వంలోని సైన్యం బంకర్లలో దాక్కుని శాంతి కోసం శరణుకోరింది.

పాకిస్తాన్ తో భారత వైఖరిని 2025 మే 12న ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. “చర్చలు, ఉగ్రవాదం ఒకేసారి సాగవు… భారత్ అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగదు… పహల్గామ్ తరహా దాడులకు సైనిక సమాధానమే ఉంటుంది” అని తేల్చి చెప్పారు. దీంతో పాక్ అణు రక్షణ కవచం చరిత్రగా మిగిలిపోయింది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు కొత్త వ్యూహాలకు, సరికొత్త బంధాలకు పాకులాడుతోంది. మునీర్ సుదీర్ఘ పర్యటనలు చేస్తూ గ్లోబల్ డ్రామాకు తెరదీశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను చూపించి ఆశ పెట్టారు. నోబెల్ శాంతి బహుమతికి మద్దతు ఇచ్చారు. అయినా అమెరికా- ఇరాన మధ్య ఒప్పందాన్ని మాత్రం మునీర్ నెరవేర్చలేకపోయారు.

ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో పాకిస్తాన్ చేతులెత్తేసింది. దీంతో అమెరికా మునీర్ ను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే మునీర్ ఇప్పుడు ప్లాన్-Bని అమలు చేస్తున్నారు.

అమెరికాపై పాకిస్తాన్ ఇప్పుడు ఆశలు వదిలేసుకుంది. ఒకవైపు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూంక్వాలలో పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇలాంటి వాటిని కట్టడి చేసి, పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే విదేశాల మద్దతు చాలా అవసరం. అందుకే సౌదీ అరేబియా, టర్కీ లాంటి దేశాలతో వ్యూహాత్మకంగా మక్కా ఒప్పందం చేసుకుంది. ఆయా దేశాలతో సమాన భాగస్వామిగా నిలబడ్డామనే అబద్ధపు ఇమేజ్‌ను పాక్ ప్రజలకు చూపే ప్రయత్నం ఇది.

ఈ ఒప్పందం ద్వారా సౌదీ నుంచి రుణసాయం, టర్కీ నుంచి మిలిటరీ టెక్నాలజీ లభించే అవకాశముంది. ఒప్పందంలో నాటో తరహా నిబంధన ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తరఫున సౌదీ లేదా టర్కీ తమ దళాలను భారత్‌పైకి పంపించే ప్రసక్తే లేదు. కానీ, రెండు బలమైన సున్నీ ఇస్లామిక్ దేశాల దౌత్యపరమైన మద్దతును పాకిస్తాన్ వాడుకునే అవకాశం ఉంది. భారత్ జరిపే ప్రతీకార దాడుల నుండి తమ ఉగ్రవాద ప్రాక్సీలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఒక కొత్త ‘డిప్లొమాటిక్ షీల్డ్’ను తయారు చేసుకుంటోంది.

ఇస్లామాబాద్ సైనిక పాలకులు ఎన్ని మక్కా ఒప్పందాలు చేసుకున్నా, ఎన్ని దౌత్యపరమైన ముసుగులు వేసుకున్నా అసలు నిజం మారదు. ఉగ్రవాదాన్ని విదేశీ విధానంగా వాడుకునే క్రమంలో పాకిస్తాన్ ఇప్పటికే తన ఆర్థిక వ్యవస్థను, సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టింది. మరి ఈ అంతర్జాతీయ రాజకీయ వేదికపై రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త ముక్కోణపు గేమ్ భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!

:- CLN RAJU (EDITOR- NTV DIGITAL)