Reading Time: 2 minutes
ప్రధాని మోదీకి వచ్చిన కానుకల వేలం.. ఎన్ని కోట్లు వచ్చాయి.. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందే కానుకలు, స్మృతిచిహ్నాలు ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారాయి. ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, వివిధ సంస్థలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇతర ప్రతినిధులు ఆయనకు అనేక రకాల బహుమతులు, మెమెంటోలు అందజేస్తుంటారు. వీటిని కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇ-వేలం నిర్వహించి విక్రయిస్తోంది. ఈ వేలాల ద్వారా ఇప్పటివరకు రూ.52 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది.

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ప్రధాని కానుకల వేలం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (NGMA) ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ కొనసాగుతోంది.

ఏ ఏడాది ఎంత ఆదాయం?

2020 తర్వాత నిర్వహించిన వేలాల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా ఉంది:

2021 తొలి ఎడిషన్: రూ.3.1 కోట్లు

2022 రెండో ఎడిషన్: రూ.3.6 కోట్లు

2023 మూడో ఎడిషన్: రూ.15.8 కోట్లు

2023 నాలుగో ఎడిషన్: రూ.14.4 కోట్లు

2024 ఐదో ఎడిషన్: రూ.11.16 కోట్లు

2024 ఆరో ఎడిషన్: రూ.2.24 కోట్లు

2025 ఏడో ఎడిషన్: రూ.1.89 కోట్లు

ఈ మొత్తం కలిపితే రూ.52 కోట్లకు పైగా నిధులు సమకూరినట్లు కేంద్రం తెలిపింది. సాధారణంగా ప్రధాని మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. 2019కు ముందు ప్రధానికి వచ్చిన ఇలాంటి కానుకలు, స్మృతిచిహ్నాలను NGMA ఆధ్వర్యంలో ఈ తరహాలో వేలం వేసే విధానం లేదని కేంద్ర మంత్రి షేకావత్ పేర్కొన్నారు.

వేలంలో ఏ వస్తువులు ఉంటాయి?

ప్రధాని మోదీకి అందిన కానుకల్లో దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, కళా సంపదకు ప్రతీకలైన వస్తువులు ఉంటాయి. పెయింటింగ్స్, శిల్పాలు, హస్తకళా వస్తువులు, మతపరమైన విగ్రహాలు, చేనేత వస్త్రాలు, క్రీడా స్మృతిచిహ్నాలు వంటి అనేక రకాల వస్తువులు వేలానికి వస్తాయి. వాటిలో కొన్ని వస్తువులు భారీ ధరలు పలికాయి. గాజు ఫ్రేమ్‌లో మినియేచర్ ఆలయ నిర్మాణంతో ఉన్న తుల్జా భవానీ విగ్రహం సుమారు రూ.1.03 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం.

అయోధ్య రామమందిర మెటాలిక్ మోడల్, జమ్మూకశ్మీర్ పష్మినా షాల్, తంజావూరు రామ దర్బార్ చిత్రం, నటరాజ మెటాలిక్ విగ్రహం, గుజరాత్ రోగన్ ఆర్ట్ ‘ట్రీ ఆఫ్ లైఫ్’, నాగాలాండ్ చేనేత షాల్, వివిధ వస్త్రాలు, పెయింటింగ్స్ కూడా వేలంలో ఆకర్షణగా నిలిచాయి. క్రీడలకు సంబంధించిన వస్తువులు కూడా వేలంలో ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. 2024 పారాలింపిక్స్ క్రీడాకారుల బూట్లు, ఒలింపిక్, పారాలింపిక్ క్రీడా సామగ్రితో పాటు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు సంబంధించిన జావెలిన్, రామమందిరం, కాశీ విశ్వనాథ ఆలయ నమూనాలు వంటి వస్తువులు కూడా వేలంలోకి వచ్చాయి.

అసలు ఆ రూ.52 కోట్లు ఎక్కడికి?

ప్రధాని మోదీకి వచ్చిన కానుకలను వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గంగా నది పరిరక్షణ, పునరుద్ధరణ, కాలుష్య నివారణ వంటి కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమమైన నమామి గంగే కింద గంగా, దాని ఉపనదుల్లో కాలుష్యాన్ని తగ్గించడం, నదీ పునరుజ్జీవనం, పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం వంటి చర్యలు చేపడుతున్నారు. మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాలు, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, జీవవైవిధ్య పరిరక్షణ తదితర ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) అమలు చేస్తోంది.

గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే..

ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తనకు వచ్చిన కానుకలను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని బాలికల విద్య కోసం వినియోగించేవారని కేంద్రం వెల్లడించింది. ఇప్పుడు అదే విధానాన్ని జాతీయ స్థాయిలో కొనసాగిస్తూ.. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది పరిరక్షణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అంటే.. ప్రముఖులు, సంస్థలు ప్రధానమంత్రికి అందించిన కానుకలు వ్యక్తిగతంగా భద్రపరచడం కాకుండా.. వాటిని ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడేలా వేలం వేస్తున్నారు. వేలం ద్వారా వచ్చిన నిధులు దేశంలోని కీలక పర్యావరణ కార్యక్రమానికి మళ్లించడం ఈ ప్రక్రియలో ప్రధాన అంశంగా నిలుస్తోంది.

పూర్తి జాబితా ఎక్కడ చూడొచ్చు?

ప్రధాని కానుకలు, మెమెంటోల ఇ-వేలం సమయంలో వస్తువుల పూర్తి వివరాలు, వాటి చిత్రాలు, ప్రారంభ ధరలు, వేలం ధరలు తదితర సమాచారాన్ని అధికారిక PM Mementos వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

మొత్తంగా చూస్తే.. ప్రధానమంత్రికి వచ్చిన ఒక జ్ఞాపికలు, కానుకల వేలం ద్వారా కొత్త విలువను సంతరించుకుంటోంది. కానుకగా వచ్చిన వస్తువు వేలంలో ఆదాయంగా మారి.. ఆ ఆదాయం గంగా నది పరిరక్షణకు ఉపయోగపడటం ఈ మొత్తం ప్రక్రియలో ఆసక్తికరమైన అంశంగా నిలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..