Reading Time: 2 minutes
Ys Jagan Slams Ap Ppp Policy Calls It Andhra Pradesh For Sale

YS Jagan Slams AP PPP Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీపీపీ (PPP) పాలసీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కొత్త PPP పాలసీని చూస్తుంటే ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’ అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తూ, చివరకు ఆ భారాన్ని ప్రజలపైనే మోపే విధంగా విధానాలు ఉన్నాయని ఆరోపించారు. PPP ప్రాజెక్టులకు ప్రభుత్వం Viability Gap Funding ఇస్తుందని, ప్రైవేట్ సంస్థలు తీసుకునే రుణాలకు వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ ఆరోపించారు. రాయితీలు కూడా ప్రభుత్వం ఇవ్వడంతో పాటు, ప్రైవేట్ సంస్థలు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. తాగునీరు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు వంటి ప్రజా సేవలను కూడా PPP పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోందని జగన్ అన్నారు. అన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఇక ప్రభుత్వం ఉండేది ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా సేవల బదులు స్కాంలు చేసి లూటీ చేయడానికే మిగులుతుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నిరసనలపై కేసులు.. కోర్టులను ఆశ్రయిస్తాం
డీఎస్సీ, రైతుల సమస్యలు, PPP, దిశ చట్టం రద్దు, బీసీ నాయకులపై కేసులు వంటి అంశాలను జగన్ ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా కేసులు పెట్టి అణచివేస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే కక్షతో అన్యాయమైన కేసులు పెడుతున్నారని జగన్ అన్నారు. ఈ అణచివేతపై కచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

బీసీ నాయకులపై అక్రమ కేసులంటూ ఆరోపణలు
బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. జరగని ఘటనను జరిగినట్లుగా వక్రీకరించి చింతాడ రవిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని అన్నారు. కేసుల కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముస్తఫా, విరూపాక్షి, కారుమూరు సునీల్‌పైనా తప్పుడు, అక్రమ కేసులు పెట్టారని జగన్ పేర్కొన్నారు. ప్రశ్నించే వారందరిపైనా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.

మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉందని జగన్ తెలిపారు. త్వరలో ఆ పదవి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ తరఫున తూమాటి మాధవరావును డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. మాధవ్‌కు పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఆయన ఎన్నిక సాఫీగా జరిగేలా సభ్యులంతా సమన్వయంతో పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు.

చంద్రబాబు వైట్‌పేపర్లపై జగన్ విమర్శలు
చంద్రబాబు విడుదల చేస్తున్న వైట్‌పేపర్లన్నీ వాస్తవానికి ‘ఎల్లో పేపర్లు’, అబద్ధాల పత్రాలని జగన్ తీవ్రంగా విమర్శించారు. ఆ పత్రాల్లోని అబద్ధాలను ఆధారాలు, సాక్ష్యాలతో ఇప్పటికే బయటపెట్టామని తెలిపారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందిస్తామని చెప్పారు. వైసీపీ ఏ అంశాన్ని మాట్లాడినా సాక్ష్యాలు, ఆధారాలు, సోర్స్‌తో మాట్లాడుతుందని జగన్ అన్నారు. తాను అయినా, పార్టీ నాయకులు అయినా ప్రతి అంశానికి మూలాలను చూపిస్తారని తెలిపారు. చంద్రబాబు మాత్రం తాను చెప్పే అంశాలకు సోర్స్ చెప్పరని విమర్శించారు. ‘వెన్నుపోటు పార్టీ’ అబద్ధాలు చెప్పడంలో ముందుంటుందని, కల్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరని జగన్ వ్యాఖ్యానించారు. అదే స్థాయిలో అబద్ధాలు చెప్పేలా లోకేష్‌కు కూడా శిక్షణ ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆధారాలతో మాట్లాడాలని నేతలకు సూచన
పార్టీ నేతలు ఎవరూ ప్రిపరేషన్ లేకుండా మాట్లాడవద్దని జగన్ సూచించారు. పూర్తిగా కసరత్తు చేసి మాట్లాడితేనే విషయం ప్రజలకు బలంగా చేరుతుందని అన్నారు. కంటెంట్ అత్యంత ముఖ్యమని, ప్రతి అంశాన్ని ఆధారాలు, సాక్ష్యాలతో వివరించాలని సూచించారు. ఏ అంశంపై ఎవరు మాట్లాడాలో ముందుగానే నిర్ణయించి, సంబంధిత నేతలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వాస్తవాలను స్పష్టంగా వివరించేలా పార్టీ నాయకులు వ్యవహరించాలని అన్నారు.

ఏ వర్గమూ సంతృప్తిగా లేదు: జగన్
రాష్ట్రంలో ఉద్యోగులతో సహా ఏ వర్గమూ సంతృప్తిగా లేదని జగన్ ఆరోపించారు. గతంలో అమలు చేసిన పథకాలను రద్దు చేసి, కొత్త పథకాలను మోసాలుగా మార్చారని విమర్శించారు. మహిళలకు అందించే సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని అన్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత.. ఇలా ఏ వర్గమూ సంతోషంగా లేదని జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని, వాటిలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తెలిపారు. ఇందుకు సంబంధించిన గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని అన్నారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణపై విమర్శలు
ప్రభుత్వ రంగ సంస్థలపైనా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా సేవలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగే ప్రమాదం ఉందని జగన్ పేర్కొన్నారు. PPP విధానం, ప్రజా సేవలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, ఉద్యోగులు, బీసీ నాయకులపై కేసులు, నిరసనల అణచివేత వంటి అంశాలపై వైసీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని జగన్ స్పష్టం చేశారు.