
Google Pixel 11 Series: గూగుల్ సంస్థ భారత్‌లో తన సరికొత్త ‘పిక్సెల్ 11’ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. MadeByGoogle ఈవెంట్‌కు ముందే ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ లాంచ్‌ను ప్రకటించిన కంపెనీ, ఫోన్ల ధరలను కూడా వెల్లడించింది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్, ఫోల్డబుల్ మోడల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే నాలుగు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈసారి గూగుల్ పూర్తి దృష్టిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే పెట్టింది. వినియోగదారుల అవసరాలను ముందే ఊహించి, సులువుగా సహాయపడే ఏఐ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.
ఈ కొత్త సిరీస్‌లో గూగుల్ శక్తివంతమైన టెన్సర్ G6 (Tensor G6) చిప్‌సెట్‌ను అందించింది. దీనికి తోడు జెమిని (Gemini) కొత్త నానో మోడల్ కలిసి పనిచేస్తుంది. హార్డ్‌వేర్, ఏఐ రెండూ కలిసి పనిచేయడం వల్ల నిత్యం చేసే పనులు ఈజీగా చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. భారత్‌లో ఆగస్టు 20 నుంచి విక్రయాలు ప్రారంభం కానుండగా, ఇప్పటికే ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ మొదలయ్యాయి. పిక్సెల్ 11 ప్రారంభ ధర రూ.89,999 కాగా, పిక్సెల్ 11 ప్రో ధర రూ.1,19,999, ప్రో ఎక్స్‌ఎల్ ధర రూ.1,34,999, అత్యంత ఖరీదైన ప్రో ఫోల్డ్ ప్రారంభ ధర రూ.1,86,999గా నిర్ణయించారు.
బేస్ మోడల్ పిక్సెల్ 11..
బేస్ మోడల్ పిక్సెల్ 11 విషయానికొస్తే, ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.3 అంగుళాల డిస్‌ప్లే, 12GB ర్యామ్, 256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుక భాగంలో ఇచ్చిన 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. ఇందులో 30x సూపర్ రిజల్యూషన్ జూమ్, నైట్ సైట్ ఫీచర్లు ఉన్నాయి. 30 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఈ ఫోన్, 30W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 55 శాతం ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా, దీని కెమెరా బార్ డిజైన్ మునుపటి కంటే 40 శాతం సన్నగా మారింది.
పిక్సెల్ 11 ప్రో..
ఇక ప్రో వెర్షన్లైన పిక్సెల్ 11 ప్రో, ప్రో ఎక్స్‌ఎల్ మోడళ్లలో వరుసగా 6.3 అంగుళాలు, 6.8 అంగుళాల సూపర్ ఆక్చువా డిస్‌ప్లేలు ఇచ్చారు. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తాయి. గీతలు పడకుండా స్క్రీన్‌పై రెట్టింపు రక్షణ ఇచ్చే యాంటీ-స్క్రాచ్ లేయర్‌ను అమర్చారు. కెమెరా పరంగా 50MP ప్రైమరీ, 48MP అల్ట్రావైడ్, 5x ఆప్టికల్ జూమ్ (120x ప్రో జూమ్) సపోర్ట్ చేసే 48MP టెలిఫోటో కెమెరాలను అందించారు. పిక్సెల్ 11 ప్రో 30 నిమిషాల్లో 55 శాతం, ప్రో ఎక్స్‌ఎల్ 75 శాతం ఛార్జ్ అవుతాయి. క్రియేటర్ల కోసం టెలిప్రాంప్టర్, స్టోరీబోర్డ్ ఎడిటింగ్ వంటి ప్రత్యేక ‘క్రియేటర్ సూట్’ కూడా ప్రో మోడళ్లలో ఉంది.
పిక్సెల్ 11 సిరీస్‌లోని కెమెరా వెనుక భాగంలో ఇచ్చిన HiLight అనే కొత్త లైటింగ్ ఫీచర్ ముఖ్యమైన నోటిఫికేషన్లను చూపిస్తుంది. Rambler ఫీచర్ మనం మాట్లాడే వాయిస్ నోట్స్‌లోని ‘ఉమ్’, ‘ఆహ్’ వంటి అనవసర శబ్దాలను తీసివేసి స్పష్టమైన టెక్స్ట్‌గా మారుస్తుంది. కెమెరాలో ఇచ్చిన Magic Capture వీడియోలోని బెస్ట్ మోమెంట్స్‌ను గుర్తిస్తే, Camera Looks ద్వారా ఫోటో తీసేటప్పుడే నాచురల్, షాడోస్ వంటి డిజైన్లను ఎంచుకోవచ్చు.
పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్..
అత్యంత సన్నని డిజైన్‌తో వచ్చిన ఫోల్డబుల్ మోడల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్, మునుపటి కంటే 10 శాతం తేలికగా, 3 రెట్లు బలంగా మారింది. ఇందులో లోపల, వెలుపల 8 అంగుళాల సూపర్ ఆక్చువా ఫ్లెక్స్ డిస్‌ప్లేలు, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. స్ప్లిట్ స్క్రీన్, డ్రాగ్ అండ్ డ్రాప్ వంటి మల్టీటాస్కింగ్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్లతో పాటు స్నాప్‌డ్రాగన్ W5 జెన్ 2 చిప్‌తో 20 శాతం వేగవంతమైన Pixel Watch 5 (ధర రూ.42,900 నుండి ప్రారంభం), Pixel Buds Pro 2 కొత్త ఆలివ్ కలర్ వేరియంట్‌ను గూగుల్ లాంచ్ చేసింది.
ఈ సిరీస్ ఫోన్లకు ఏకంగా 7 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ, పిక్సెల్ డ్రాప్ అప్‌డేట్లు ఇస్తామని గూగుల్ హామీ ఇచ్చింది. ప్రో మోడళ్లు కొనుగోలు చేసిన వారికి 6 నెలల పాటు ‘Google AI Pro’ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై క్యాష్‌బ్యాక్, 24 నెలల నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్, శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా టెన్సర్ G6, జెమిని ఏఐ పవర్‌తో గూగుల్ ఈ సిరీస్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.