Reading Time: 2 minutes
Actor Vikram: కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్.. నెట్టింట వీడియో దుమారం.. చివరకు ఏమైందంటే?

కోలీవుడ్ హీరో విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో దుమారం రేపుతోంది. అరుదైన లార్‌ గిబ్బన్‌ అనే అరుదైన విదేశీజాతి కోతితో సరదాగా గడుపుతున్న వీడియోను ఆయన షేర్‌ చేశారు. విక్రమ్‌ అభిమానులు ఈ వీడియోను చూసి ముచ్చటపడ్డారు. కానీ ఈ లార్‌ గిబ్బన్‌ జాతికి చెందిన కోతిని పెంచుకోవడం చట్టవిరుద్ధమని కొందరు జర్నలిస్టులు, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి విక్రమ్‌ వియ్యంకుడు, కెవిన్‌కేర్‌ వ్యవస్థాపక చైర్మన్‌ రంగనాథన్‌ ఈ కోతిని తెప్పించారు. ఇండోనేషియాకు చెందిన లార్‌ గిబ్బన్‌ కోతిని తెప్పించారనే ఆరోపణలు వచ్చాయి. మణిపూర్‌ మీదుగా ఈరోడ్‌కు, అక్కడినుంచి చైన్నైలోని రంగనాథన్‌ ఇంటికి తరలించినట్టు చెబుతున్నారు. లార్‌ గిబ్బన్‌ కోతి అంతర్జాతీయ వన్యప్రాణి వాణిజ్య నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తుంది. అలాగే భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా ఈ జంతువుకు రక్షణ ఉంది. తగిన పత్రాలు, అనుమతులు లేకుండా ఇలాంటి అరుదైన విదేశీ వన్యప్రాణులను పెంచుకోవడం చట్టరీత్యా నేరమని చెబుతున్నారు.

విక్రమ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈ అంశంపై విచారణ ప్రారంభించారు. లార్‌ గిబ్బన్‌ని ఇంట్లో పెంచుకునేందుకు అవసరమైన అనుమతులు, సంబంధిత పత్రాలు ఉన్నాయా అనే అంశాలను అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ అంశం వివాదాస్పదం కావడం, పోస్ట్ చేసిన 24 గంటల్లోనే విక్రమ్‌ ఈ వీడియోను డిలీట్‌ చేశారు.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే చియాన్ విక్రమ్ చివరిసారిగా ‘వీర ధీర సూరన్‌’ లో హీరోగా నటించారు. ఎస్.యు. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.  ప్రస్తుతం విక్రమ్ సంచలన దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.