Reading Time: 3 minutes

గాంజా, డ్రగ్స్ మత్తులో ఖైదీలు… ఒకే సూది వాడకంతో 43 మందికి హెపటైటిస్ సీ, 39 మందికి హెచ్ఐవీ..

Caption of Image.
  • దేశవ్యాప్తంగా జైళ్లలో ఢిల్లీ ఎయిమ్స్, ఎన్డీడీటీసీ సర్వే
  • దేశంలోని 17 జైళ్లలోని 7,004 మంది ఖైదీలపై స్టడీ
  • మన రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్ జైళ్ల నుంచి 800 మంది
  • జైలు లోపల 412 మంది ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నట్లు వెల్లడి
  • జైలు ఎంట్రీలోనే డ్రగ్ స్క్రీనింగ్, డీ-అడిక్షన్ సేవలు అందించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: గాంజా, డ్రగ్స్ మత్తులో ఖైదీలు జోగుతున్నారని, కఠినమైన భద్రత ఉండే కారాగారాల లోపల కూడా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని ఢిల్లీ ఎయిమ్స్ – నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌‌‌‌మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ) తాజా స్టడీలో వెల్లడైంది. ఎయిమ్స్‌‌‌‌కు చెందిన ప్రముఖ వైద్యులు రవీందర్ రావు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ రీసెర్చ్ ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’లో ఇటీవలే పబ్లిష్ అయింది. 

జూన్ 2019 నుంచి మార్చి 2020 మధ్య దేశవ్యాప్తంగా 17 జైళ్లలోని 7,004 మంది ఖైదీలను సర్వే చేయగా, అందులో 412 మంది (5.9 శాతం) ఖైదీలు జైలు లోపలే గంజాయి, హెరాయిన్ వంటి డ్రగ్స్ వాడుతున్నారని, ఒకే సూదితో డ్రగ్స్ ఎక్కించుకోవడం వల్ల హెపటైటిస్-–సీ, హెచ్‌‌‌‌ఐవీ వంటి రోగాల బారిన పడుతున్నారని తేలింది. ఈ స్టడీలో మన రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి 500 మంది, నిజామాబాద్ జిల్లా జైలు నుంచి 300 మంది కలిపి మొత్తం 800 మంది ఖైదీల వివరాలను సేకరించారు. హైదరాబాద్ ఐఎంహెచ్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా శంకర్ మొలంగూరి కూడా ఈ రీసెర్చ్ టీమ్‌‌‌‌ లో కీలక పాత్ర పోషించారు.

జైలు లోపలా గంజాయి, హెరాయిన్.. 

పటిష్టమైన భద్రత ఉండే జైళ్ల లోపల కూడా ఖైదీలు మత్తు పదార్థాలను వాడుతున్నట్లు రీసెర్చ్‌‌‌‌లో తేలింది. సర్వలో పాల్గొన్నవారిలో 412 మంది (5.9 శాతం) జైలులో డ్రగ్స్ తీసుకుంటుండగా, 273 మంది గాంజా వినియోగిస్తున్నారు. వీరిలో ఏకంగా 247 మంది (91 శాతం) పొగ రూపంలోనే గంజాయి పీలుస్తున్నారు. ఆ తర్వాత హెరాయిన్ వంటి ఓపియాయిడ్ డ్రగ్స్‌‌‌‌ను 129 మంది (1.8 శాతం) వాడుతున్నారు. 

ఈ ఓపియాయిడ్ బాధితుల్లో 90 మంది (70 శాతం) హెరాయిన్ వాడుతుండగా.. వారిలో 55 మంది పొగ రూపంలో పీల్చుతుండగా, 35 మంది నేరుగా నరాల్లోకి సూదులతో ఎక్కించుకుంటున్నారు. మరో 33 మంది (26 శాతం) పెయిన్ కిల్లర్స్, ఫార్మా మందులను మత్తు కోసం వినియోగిస్తున్నారు. ఇవే కాకుండా మద్యం తాగుతున్నవారు 64 మంది (0.9 శాతం), నిద్రమాత్రలను వాడుతున్నవారు 45 మంది (0.6 శాతం) ఉన్నారని రీసెర్చ్‌‌‌‌లో వెల్లడైంది.

వాడిన సూదులనే మళ్లీమళ్లీ వాడడంతో..

నరాల్లోకి ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ ఎక్కించుకునే ప్రమాదకర అలవాటు 304 మంది (4.3 శాతం) ఖైదీలలో ఉంది. ఇంజెక్షన్లు వాడే వీళ్లలో 142 మంది (47 శాతం) ఇతరుల సూదులను షేర్​చేసుకోగా, 198 మంది (65 శాతం) పాత సిరంజీలనే మళ్లీ మళ్లీ వాడారు. ప్రస్తుత జైలు శిక్ష సమయంలో కూడా 52 మంది (17 శాతం) జైలు లోపలే సూదుల ద్వారా డ్రగ్స్ తీసుకోగా, అందులో 26 మంది (50 శాతం) ఇతరుల సూదులనే పంచుకున్నారు. 

డ్రగ్స్ ఎక్కువై పడిపోయే ఓవర్ డోస్ సంఘటనలు 120 మంది (40 శాతం) ఇంజెక్టింగ్ డ్రగ్ వినియోగదారుల్లో జరిగాయి. ఖైదీలు స్వయంగా తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు ఇతరుల సూదుల వాడకం వల్ల తమకు హెపటైటిస్–-సీ పాజిటివ్ అని 43 మంది, హెచ్‌‌‌‌ఐవీ పాజిటివ్ అని 39 మంది వెల్లడించారు. ఈ 39 మంది హెచ్‌‌‌‌ఐవీ బాధితుల్లో 27 మంది మాత్రమే యాంటీ రెట్రోవైరల్ చికిత్స పొందుతున్నారు.

తట్టుకోలేని విత్‌‌‌‌డ్రాయల్ బాధలు..

బయట మత్తుకు అలవాటుపడి జైలుకు రాగానే ఒక్కసారిగా బంద్ కావడంతో ఖైదీలు తీవ్రమైన ‘విత్‌‌‌‌డ్రాయల్స్’ (నరకం లాంటి శారీరక నొప్పులు, మానసిక అలజడి) ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మద్యం, గంజాయి, హెరాయిన్ వాడే వందలాది మంది ఖైదీలు జైలులో ఈ విత్‌‌‌‌డ్రాయల్ బాధలతో నరకం అనుభవిస్తున్నారు. రీసెర్చ్ లెక్కల ప్రకారం.. 30 ఏళ్లలోపు యువకులు, పురుషులు, గతంలో మళ్లీ మళ్లీ జైలుకు వచ్చినవారు, డ్రగ్స్ కేసుల్లో అరెస్టయినవారు జైలు లోపల మత్తు పదార్థాలు వాడే అవకాశం చాలా ఎక్కువని తేలింది. 

ముఖ్యంగా జైలుకు రాకముందు గంజాయి వాడినవారు లోపల కూడా డ్రగ్స్ వాడే ముప్పు దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. జైలు గోడల లోపల మత్తు పదార్థాలు దొరక్క విత్‌‌‌‌డ్రాయల్ బాధలతో సతమతమయ్యే ఖైదీలు.. ఆ శారీరక నరకం నుంచి బయటపడటానికే లోపల ఎలాగైనా మళ్లీ మత్తు పదార్థాలను వెతుక్కుని వాడుతున్నారని నిపుణులు విశ్లేషించారు.

జైళ్లలోనే డీ-అడిక్షన్ సేవలు అవసరం..

జైళ్లలో ఖైదీల మత్తు అలవాటును నివారించకపోతే వారు విడుదలయ్యాక మళ్లీ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని రీసెర్చర్స్ హెచ్చరించారు. ఖైదీ జైలులోకి అడుగుపెట్టగానే వారి డ్రగ్ అలవాట్లను తనిఖీ చేసే స్క్రీనింగ్ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. జైలు హాస్పిటల్స్ లోనే విత్ డ్రాయల్స్ నివారణకు తక్షణ వైద్యం అందించాలని, ఓపియాయిడ్ బాధితులకు జైలులోనే ‘ఓపియాయిడ్ యాగోనిస్ట్ ట్రీట్‌‌‌‌మెంట్’ అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. 

ఖైదీలు విడుదలయ్యాక కూడా సమాజంలో డీఅడిక్షన్ చికిత్స పొందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, మానవ హక్కులు, ప్రాథమిక ఆరోగ్య సూత్రాలకు భంగం కలగకుండా జైళ్లలో డీ-అడిక్షన్ వైద్య సేవలను పెంచాలని రీసెర్చ్ స్పష్టం చేసింది.
 

©️ VIL Media Pvt Ltd.