
జెన్‌జెడ్ అంటే కేవలం కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే తరం మాత్రమే కాదు.. డబ్బు ఖర్చు చేసే విషయంలోనూ పాత తరాలకు భిన్నంగా ఆలోచిస్తోంది. అవసరమైన వస్తువులు కొనడానికి, రెంట్ కట్టేందుకు, చదువుకు సంబంధించిన ఖర్చులు భరించడానికి కూడా అప్పులు చేసేందుకు యువత అస్సలు వెనుకాడటం లేదు. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా Kiwi విడుదల చేసిన డేటా ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. 2026 జూన్-జూలైలో 25వేల మంది వినియోగదారులపై సేకరించిన డేటా ప్రకారం.. Gen Z యువత ఇతర తరాలతో పోలిస్తే రెంట్, ఎడ్యుకేషన్ చెల్లింపులపై సుమారు 20 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తోందట. అంటే క్రెడిట్ కేవలం షాపింగ్, లగ్జరీ ఖర్చులకు మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ ఖర్చులకూ వాడేస్తున్నారు.
జెన్‌జెడ్ ఖర్చుల్లో మరో ఆసక్తికరమైన మార్పు ‘కన్వీనియన్స్’కు ఇస్తున్న ప్రాధాన్యత. ముఖ్యంగా కిరాణా కొనుగోళ్లలో క్విక్ కామర్స్ యాప్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. జెన్‌జెడ్ వినియోగదారులు క్విక్ కామర్స్‌పై 30 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. మెుత్తం ఖర్చుల్లో క్విక్ కామర్స్ వాటా 2.6 శాతంగా ఉండగా, సంప్రదాయ రిటైలర్ల విషయంలో అది కేవలం 0.85 శాతంగా ఉంది. అంటే ‘చౌకగా దొరుకుతుందా?’ అనే ప్రశ్నతో పాటు ఎంత త్వరగా, ఎంత ఈజీగా దొరుకుతుంది? అనేదీ యువత నిర్ణయాల్లో కీలకంగా మారిపోయింది.
క్రెడిట్ కార్డుల వినియోగంలోనూ జెన్‌జెడ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. చిన్నచిన్న కొనుగోళ్లను పదేపదే క్రెడిట్ కార్డుతో చేయడం కంటే.. పెద్ద మొత్తంలో ఖర్చయ్యే కొనుగోళ్లకు క్రెడిట్‌ను ఉపయోగించేందుకు ఈ తరం ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. అంతేకాదు వేర్వేరు కార్డుల నుంచి గరిష్ఠ క్యాష్‌బ్యాక్, రివార్డులు పొందడంపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదట. సింపుల్‌గా చెప్పాలంటే.. ఎంత రివార్డ్ వస్తుంది? అనే దానికంటే ఎంత ఈజీగా పేమెంట్ అవుతోంది? అనే దానికే ప్రాధాన్యత ఇస్తోంది ఈ తరం.
అయితే అసలు క్రేజీ ట్రెండ్ EMIల విషయంలోనూ కనిపిస్తోంది. జెన్‌జెడ్ లో ఈఎంఐల వాడకం మొత్తంగా తక్కువగానే ఉన్నప్పటికీ.. EMI ఎంచుకునే వారు మాత్రం హైవ్యాల్యూ వస్తువుల షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా.. నెలవారీ చెల్లింపులు అందుబాటులో ఉండేలా ఎక్కువ కాలం EMI ఎంచుకుంటున్నారు. దీని వల్ల ప్రతి నెల చెల్లించాల్సిన మొత్తం తగ్గినా, వడ్డీ కారణంగా చివరికి చెల్లించే మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ తరం వెంటనే కొనేద్దాం.. తర్వాత మెల్లగా చెల్లిద్దాం అనే విధానాన్ని ఇష్టపడుతున్నారు.
జెన్‌జెడ్ తప్పనిసరిగా ఎక్కువసార్లు క్రెడిట్ ఉపయోగించడం లేదు.. వారు క్రెడిట్‌ను భిన్నంగా ఉపయోగిస్తున్నారని Kiwi సీఓఓ సిద్ధార్థ్ మెహతా చెప్పారు. సౌకర్యం, ఫ్లెక్సిబిలిటీ, నెలవారీ బడ్జెట్‌పై తక్కువ ఒత్తిడి వంటి అంశాలు వారి ఆర్థిక నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నాయి. అయితే సులభంగా లభించే క్రెడిట్‌ను అవసరమైన ఖర్చులకు, పెద్ద కొనుగోళ్లకు విచక్షణ లేకుండా ఉపయోగిస్తే అప్పుల భారం పెరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే జెన్‌జెడ్‌కు క్రెడిట్ ఒక ‘ఫ్రీ మనీ’ కాదు.. భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సిన డబ్బు.