
- రద్దు చేయాలంటూ తీర్మానం చేసిన తమిళనాడు అసెంబ్లీ
- మద్దతు తెలిపిన ప్రధాన ప్రతిపక్షాలు
- వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే వాకౌట్
- నీట్ వల్ల గ్రామీణ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు నష్టపోతున్నారన్న నేతలు
చెన్నై: నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం తీర్మానాన్ని ఆమోదించారు. దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే సభ నుంచి వాకౌట్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఏకపక్షంగా ఉందని, కేంద్ర చట్టాలలో సవరణలు చేసి నీట్‌ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ఆరోగ్య మంత్రి అరుణ్‌రాజ్ శాసనసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
నీట్ పరీక్ష సామాజిక న్యాయానికి, సమానత్వానికి, రాష్ట్రాల హక్కులకు విరుద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంతాల, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు, ముఖ్యంగా తమిళ మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. కాగా, తమిళనాడు ప్రభుత్వ తీర్మానానికి అన్నాడీఎంకే సంపూర్ణ మద్దతు తెలిపింది. తమ పార్టీ నీట్ వ్యతిరేక విధానానికే కట్టుబడి ఉందని అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఓఎస్ మాణియన్ స్పష్టం చేశారు.
డీఎంకే ఎమ్మెల్యే ముత్తురాజా కూడా ఈ తీర్మానానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ వ్యతిరేకించారు. నీట్ తమిళనాడు విద్యార్థులకు ఒక అవకాశాన్ని, భవిష్యత్తుపై ఆశను కల్పిస్తోందని చెప్పారు. ఉదాహరణకు పొల్లాచిలో ఒకే పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు నీట్ పాసయ్యారని తెలిపారు. పరీక్షను రద్దు చేయాలని కోరే బదులు, రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.