Reading Time: 3 minutes
India Unemployment Jharkhand Reveals Job Crisis Explained

అతను చదువుతున్నాడు.. చదువుతూనే ఉంటాడు. చదవడం అతని పని. ఎదురు చూడటం అతని జీవితం. ఇండియాలో నిరుద్యోగం గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా చక్కగా లెక్కలు చెబుతాం. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగం లేకుండా ఉన్నారు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని పట్టికలు వేస్తాం. కానీ ఒక మనిషి జీవితంలో నుంచి జారిపోయిన సంవత్సరాలను లెక్కపెట్టడానికి ఏ పట్టికా లేదు.

2025లో భారత గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు 11.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ రేటు 3.1 శాతం. 2023 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు దాదాపు కోటి 10లక్షల పైమాటే. ఈ కోటి మంది కుటుంబాల్లో ఒకే ప్రశ్న. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానం రాకముందే ఇంకో సంవత్సరం వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే యువత జీవితంలో అత్యంత విచిత్రమైన విషయం ఇదే.

వాళ్లు ఖాళీగా ఉండరు. వాళ్లు ఉదయం లేస్తారు. పుస్తకాలు తెరుస్తారు. నోట్స్ రాస్తారు. పరీక్షలు రాస్తారు. మాక్ టెస్టులు చేస్తారు. నగరాలు మారతారు. హాస్టళ్లలో ఉంటారు. కోచింగ్ ఫీజులు కడతారు. పరీక్ష కేంద్రాలకు ప్రయాణిస్తారు. ఫలితాల కోసం వెబ్‌సైట్లు చూస్తారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో రాత్రిళ్లు మెలకువగా ఉంటారు. వారి రోజంతా ఉద్యోగం చుట్టూనే తిరుగుతుంది. ఉద్యోగం మాత్రం వారి దగ్గరకు రాదు.

ఇక్కడే ఒక విచిత్రమైన పరిపాలనా కళ మొదలవుతుంది. ఒక మనిషి సమయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వానికి అతని మీద ఎలాంటి ఆదేశం జారీ చేయాల్సిన అవసరం లేదు. ఒక పరీక్షను వాయిదా వేస్తే చాలు. ఒక ఫలితాన్ని నిలిపేస్తే చాలు. ఒక నోటిఫికేషన్‌ను ఆలస్యం చేస్తే చాలు. మిగతా పనిని కాలమే చేసేస్తుంది. జార్ఖండ్‌లో ఇప్పుడు కనిపిస్తున్న ఆందోళనను అందుకే ఒక పరీక్ష వివాదం పరిమితిలో పెట్టలేం.

2026 జూలై 25న రాంచీలో విద్యార్థులు వీధుల్లో చేరడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 19న జరిగిన 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ ఫలితాలు జూలై మొదట్లో వచ్చాయి. ఫలితాలతో పాటు పేపర్ లీక్, అక్రమాలు, మానిప్యులేషన్ ఆరోపణలు బయటకొచ్చాయి. జూలై 29 నాటికి ఆ నిరసన జైపాల్ సింగ్ స్టేడియం వరకు చేరింది. ఆగస్టు 2న విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. 14వ JPSC ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని.. ఈ నియామకాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలని పట్టుబట్టాడు.

నిజానికి వాళ్ల గొంతులో వినిపిస్తున్నది పరీక్షపై అనుమానమే కానీ దాని లోతులో మరొకటి కూడా ఉంది. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని చదివించారు. ఎదురు చూడమన్నారు. మళ్లీ పరీక్ష రాయమన్నారు. మళ్లీ ఫీజు కట్టమన్నారు. మళ్లీ సిద్ధం అవ్వాలన్నారు. మా వయసు పోయింది. మా డబ్బు పోయింది. మా జీవితంలో కొన్ని సంవత్సరాలు పోయాయి. ఇప్పుడు కనీసం నిజం చెప్పండి.
ఒక అభ్యర్థి దేవాశిష్ చెప్పిన లెక్క వింటే ఈ నిరీక్షణకు ఒక భయంకరమైన పొడవు కనిపిస్తుంది. పదేళ్లలో JSSC-CGL పరీక్ష కోసం ఏడు సార్లు దరఖాస్తు చేశాడు. ఒక పరీక్ష రద్దయింది. ఇంకోటి వాయిదా పడింది. ఒక తేదీ వచ్చింది. మళ్లీ పోయింది. అభ్యర్థులు పరీక్ష కోసం రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మీద నిద్రించేవారు. ఆఫీస్ భవనాల నేలపై రాత్రులు గడిపేవారు. ఒక దేశంలో ఉద్యోగం కోసం చదువుకున్న మనిషి తన రాత్రిని రైల్వే ప్లాట్‌ఫామ్‌కు అప్పగించాల్సి వస్తే, ఆ రాత్రి అతని వ్యక్తిగత దురదృష్టం మాత్రమే కాదు.. అది ఒక వ్యవస్థ తన పౌరుడితో ఎలా వ్యవహరిస్తుందో చెప్పే దృశ్యం.

జార్ఖండ్‌లో ఇది కొత్త దృశ్యం కూడా కాదు. 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పేపర్ లీకులు, పరీక్షల రద్దు, ఫలితాల ఆలస్యం, నియామకాల నిలిచిపోవడం తిరుగుతూనే ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌లో వేలాది మంది అభ్యర్థులు దాదాపు 100 కిలోమీటర్లు నడిచి రాంచీకి వచ్చారు. డిసెంబర్‌లో 3 లక్షల మంది రాసిన పరీక్షలో కేవలం 2,231 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు షార్ట్‌లిస్ట్ అయ్యారు.

వాళ్లు కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా బారికేడ్లు, భద్రతా బలగాలు అవసరమయ్యాయి. ఇది మన కాలపు ఒక విచిత్రమైన చిత్రం. ఉద్యోగం కోసం చదివినవాడు గేటు బయట.. ఉద్యోగం ఇవ్వాల్సిన కార్యాలయం గేటు లోపల. మధ్యలో బారికేడ్లు. ఆ బారికేడ్లకు ఇరువైపులా ఒకే ప్రభుత్వానికి చెందిన రెండు ప్రపంచాలు. ఒకటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రజలది. మరొకటి ఆ ఉద్యోగాన్ని ఇవ్వాల్సిన వ్యవస్థది. ఈ మధ్యలోనే సంవత్సరాలు పేరుకుపోతున్నాయి. ఒక నోటిఫికేషన్ ఆలస్యం అయితే ఒక కుటుంబంలో ఒక పెళ్లి వాయిదా పడవచ్చు. ఒక నియామకం ఆగిపోతే ఒక ఇంట్లో అప్పు పెరగవచ్చు.

ఒక పరీక్ష రద్దయితే ఇంకో ఏడాది హాస్టల్ ఫీజు రావచ్చు. ఒక ఫలితం ఆగిపోతే తండ్రి తన కొడుకును ఇంకెంతకాలం పోషించాలో లెక్కపెట్టవచ్చు. ఇలా పరిపాలనా ఆలస్యం క్రమంగా ఇంట్లోకి వస్తుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది. తల్లి అడిగే ప్రశ్నగా మారుతుంది. తండ్రి కోపంగా మారుతుంది. బంధువుల ఎత్తిపొడిచే మాటగా మారుతుంది. పెళ్లి మాట ఆగిపోవడానికి కారణమవుతుంది. ఒక చిన్న గదిలో ఐదేళ్లు ఒకే పుస్తకాలు చదివిన అన్నయ్యను చూస్తూ పెరిగే తమ్ముడి జ్ఞాపకంగా మారుతుంది.

ఇలా నిరుద్యోగం అనేది గణాంకాల్లో కనిపించదు. ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ అనే మాటకు కూడా కొత్త అర్థం వస్తుంది. మొదట్లో పోటీ మార్కుల మధ్య ఉంటుంది. తర్వాత డబ్బు, కోచింగ్, ప్రయాణం మధ్య ఉంటుంది. ఆ తర్వాత అదృష్టం మధ్య ఉంటుంది. చివరికి… సహనానికి వస్తుంది.

ఎవరు ఎక్కువ కాలం నిలబడగలరు? ఎవరి కుటుంబం ఇంకో సంవత్సరం ఖర్చు భరించగలదు? ఎవరు ఇంకోసారి కోచింగ్ ఫీజు కట్టగలరు? ఎవరు ఇంకోసారి పరీక్ష రాయగలరు? ఎవరి వయసు ఇంకా అర్హతలో ఉంది? ఇలా చూస్తే ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష అనేది కొన్ని గంటల పరీక్ష కాదండి.. ఒక మనిషి ఆర్థిక పరిస్థితి, కుటుంబం, వయసు, మానసిక బలం అన్నింటినీ కలిపి పరీక్షించే సుదీర్ఘమైన ప్రక్రియ. అందుకే కోచింగ్ పరిశ్రమ ఇంత పెద్దదిగా మారింది. 2025లో భారత కోచింగ్ ఇండస్ట్రీ విలువ దాదాపు 68,500 కోట్ల రూపాయలు. 2034 నాటికి అది 1.69 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.

ఇక పరీక్షల కోసం ప్రత్యేకంగా ఉన్న టెస్ట్ ప్రిపరేషన్ మార్కెట్ విలువ 2025లోనే దాదాపు 2,970 కోట్ల రూపాయలు. 2034 వరకు ఈ మార్కెట్ ఏటా దాదాపు 27శాతం చొప్పున పెరుగుతుందని అంచనా. నిజానికి ఒక పరీక్ష వాయిదా పడినప్పుడు ఒక కోచింగ్ సంస్థకు ఇంకో బ్యాచ్ వస్తుంది. ఒక నియామకం రద్దయినప్పుడు ఇంకో సంవత్సరం ఫీజు వస్తుంది. ఒక అభ్యర్థి వయసు పెరిగినప్పుడు ఒక కొత్త పుస్తకం అమ్ముడవుతుంది. వ్యవస్థ ఆలస్యం చేస్తుంది. మార్కెట్ ఆ ఆలస్యాన్ని డబ్బుగా మార్చుకుంటుంది. ఇంతలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలు మాత్రం ఫిల్ అవ్వకుండా ఉండిపోతాయి.

2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 9.64 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక వైపు ఖాళీ కుర్చీలు.. మరో వైపు ఆ కుర్చీల కోసం సంవత్సరాలుగా చదువుతున్న మనుషులు. ఇద్దరి మధ్యలో మాత్రం ఒక ఫైల్. ఆ ఫైల్ మీద ఒక తేదీ. ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్న ఒక జీవితం. ఇంకా భయంకరమైనది వయసు. ప్రభుత్వం ఒక పరీక్షను మూడేళ్లు ఆలస్యం చేయగలదు.. కానీ మనిషి వయసును మూడేళ్లు వెనక్కి తిప్పలేడు.

వయోపరిమితి ఒక గోడలా ముందే నిలబడి ఉంటుంది. పరీక్ష ఆలస్యమవుతుంది. నోటిఫికేషన్ ఆలస్యమవుతుంది. నియామకం ఆలస్యమవుతుంది. కానీ గోడ మాత్రం కదలదు. ఒక రోజు ఒక అభ్యర్థి తన పుస్తకం తెరిచి అర్హతను చూస్తాడు. అతని మార్కులు సరిపోతాయి. అతని చదువు సరిపోతుంది. అతని కల ఇంకా ఉంది. అతని వయసు మాత్రం సరిపోదు. అప్పుడు ఓడిపోయింది ఎవరు? అతనా? లేదా అతన్ని ఇంతకాలం ఎదురు చూసేలా చేసిన వ్యవస్థా?