Reading Time: < 1 minute

పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. ఆగస్టు 13న టికెట్లు విడుదల

Caption of Image.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి  విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో 2026 ఆగస్టు 12న చంద్రగిరి ఎమ్మెల్యే  పులివర్తి నానితో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈవో సూచించారు.  ఆగస్టు 21న శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

భక్తులకు విస్తృత సౌకర్యాలు

మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పెండాళ్లు, సూచిక బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని జేఈవో ఆదేశించారు. తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం విస్తృతంగా అందించడంతో పాటు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచాలన్నారు.

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.  

13న ఆన్ లైన్ లో టికెట్ల విడుదల 

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఆఫ్ లైన్ టికెట్లను ఒక రోజు ముందు ఆలయ ముందు ఉన్న కౌంటర్ లో విడుదల చేయనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.