ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఇది మీ కోసమే. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం విధించింది. ఇందుకు విధించిన గడువు ఆగస్ట్ 16 వరకు పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. ఇప్పుడు మరోసారి పొడిగించే అవకాశం లేదు.
ఆగస్ట్ 16 చివరి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఆలోపు పూర్తి చేయకపోతే గ్యాస్ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నుంచి అందే గ్యాస్ సబ్సిడీలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా పేదలకు ప్రతీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై రూ.300 వరకు రాయితీ అందిస్తోంది. ఏడాదికి నాలుగు సిలిండర్లకు ఈ రాయితీ పొందవచ్చు. కేవైసీ పూర్తి చేయకపోతే ఈ సబ్సిడీ నిధులు నిలిచిపోతాయి.
ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్లపై రాయితీలు కల్పిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతీ గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ అందిస్తోంది. కేవైసీ పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి అందే పథకాలు నిలిచిపోతాయి. దీంతో సాధారణ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సబ్సిడీ నిలిచిపోకుండా, గ్యాస్ కనెక్షన్లలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి. ఈ మేరకు పూర్తి చేయనివారందరికీ గ్యాస్ కంపెనీలు మెస్సేజ్‌లు పంపిస్తున్నాయి. గృహ వినియోగ ధరలకే సిలిండర్లు పొందేందుకు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇంతకముందు గుర్తు చేసినపన్పటికీ ఇంకా మీరు పూర్తి చేయలేదంటూ ఆయిల్ కంపెనీలు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి.
ఆగస్ట్ 16వ తేదీలోపు కేవైసీ పూర్తి చేయకపోతే గృహ వినియోగ ధరలకు సిలిండర్ పొందేందుకు అనర్హులు అవుతారంటూ కంపెనీలు చెబుతున్నారు. దయచేసి త్వరగా కేవైసీ పూర్తి చేయాలని కోరుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ వద్ద లేదా డెలివరీ సిబ్బంది వద్ద ఉండే మెషిన్ల ద్వారా పూర్తి చేయాలని కోరింది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసి ఉంటే మళ్లీ అవసరం లేదని తెలిపాయి.




