
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆగస్టు నెలాఖరులో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 28 ఏళ్ల కరోలిన్ లీవిట్.. గత ఏడాదిన్నరగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పదవిలో పనిచేయడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని ఆమె పేర్కొన్నారు. ఇటీవలే ఆమె మాతృత్వ సెలవు ముగించుకుని విధుల్లోకి తిరిగి వచ్చారు. మే నెలలో ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చారు.
ట్రంప్ సలహాదారుగా కొనసాగింపు
ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ కరోలిన్ లీవిట్ ట్రంప్ ముఖ్యమైన బాహ్య సలహాదారుల్లో ఒకరిగా కొనసాగుతారని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రిపబ్లికన్ పార్టీలో ఆమె ప్రభావవంతమైన స్వరంగా కొనసాగుతారని చెప్పారు. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ట్రంప్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె తనకు కీలకంగా ఉంటారని పేర్కొన్నారు.
కరోలిన్ లీవిట్ 2024లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో చేరారు. అనంతరం ట్రంప్ అధికార బదిలీ బృందానికి ప్రతినిధిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమెను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు. తన పదవీకాలంలో లీవిట్, వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్‌తో కలిసి మీడియా వ్యవహారాల్లో పలు మార్పులు తీసుకొచ్చారు. పాడ్‌కాస్ట్‌లు, న్యూస్‌లెటర్లు, డిజిటల్ మీడియా సంస్థలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ మీడియాకు యాక్సెస్‌ను విస్తరించారు. అంతేకాకుండా సంప్రదాయ ప్రెస్ పూల్ విధానంలోనూ మార్పులు చేశారు. ఈ చర్యలను కొందరు ప్రశంసించగా.. ప్రెస్ స్వేచ్ఛ కోసం పనిచేసే సంస్థలు మాత్రం విమర్శలు వ్యక్తం చేశాయి.