
G.V. Raja Stadium: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని జీవీ రాజా స్టేడియం (G.V. Raja Stadium) రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారనున్నాయి. ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ఒలింపిక్ క్రీడల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ 100 కోట్ల రూపాలయని కేటాయించారు. 2036 సమ్మర్ ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ ఇప్పటికే అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ను ప్రధాన ఆతిథ్య నగరంగా ప్రతిపాదించినప్పటికీ, దేశంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే తిరువనంతపురంలో కూడా ఒక అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ వేదిక అందుబాటులోకి తేనున్నారు.
కేరళ యూనివర్సిటీతో సురేశ్ గోపీ భేటీ:
స్టేడియం యజమాన్య బాధ్యతలు చూస్తున్న కేరళ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్, సిండికేట్ ఫైనాన్స్ సభ్యుడు ఆర్ఎస్ శశికుమార్‌లతో కలిసి కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్ గోపీ స్టేడియాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) మరియు మాస్టర్ ప్లాన్‌ను కేరళ యూనివర్సిటీ త్వరలోనే రూపొందించనుంది.
►ALSO READ | ధోనీ కమ్‌బ్యాక్పై సస్పెన్స్: మెక్‌కల్లమ్ రాకపై సీఎస్‌కే పోస్ట్ వైరల్.. యెల్లో ఆర్మీలో బాజ్‌బాల్ షురూ?
పునరుద్ధరణ అత్యవసరం:
1937లో నాటి తిరువాన్కూర్ సంస్థానంలో రూపుదిద్దుకున్న ఈ స్టేడియం, త్వరలోనే 90 ఏళ్ల మైలురాయిని చేరుకోనుంది. గతంలో ఒక అంతర్జాతీయ వన్డే (ODI) మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ గ్రౌండ్, కొన్నేళ్లుగా సరైన పర్యవేక్షణ లేక సింథటిక్ ట్రాక్ సహా ఇతర మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేరళ క్రీడారంగ పితామహుడిగా గుర్తింపు పొందిన కల్నల్ గోదావర్మ రాజా పేరు మీదుగా ఈ స్టేడియానికి నామకరణం చేశారు.