Reading Time: 2 minutes

విడాకులు నా వ్యక్తిగతం: మాజీ భార్య ఆరోపణలపై నోరువిప్పిన ఆసీస్ మహిళా వైస్ కెప్టెన్ 

Caption of Image.

మెల్ బోర్న్: విడాకులు, మాజీ భార్య మోనికా రైట్ ఆరోపణలపై ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ యాష్లీ గార్డనర్ తొలిసారి మౌనం వీడారు. ఈ మేరకు ఇన్‎స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టిన ఆమె.. తన భార్య మోనికా రైట్ నుంచి విడిపోవడం, డివోర్స్ తీసుకోవడం వ్యక్తిగత విషయమని పేర్కొన్నారు. కాకపోతే ఆస్ట్రేలియా వంటి ఉన్నతమైన జట్టుకు వైస్ కెప్టెన్ హోదాలో ఉండటంతో ఈ విషయంపై బహిరంగంగా వివరణ ఇవ్వాలనుకున్నానని స్పష్టం చేశారు.

తన నాయకత్వ పాత్రకు మద్దతు ఇస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు యాష్లీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే సీజన్‌లో ఒక నాయకురాలిగా బలమైన పాత్ర పోషించడానికి, నా సహచర క్రీడాకారులకు సాధ్యమైనంత ఉత్తమమైన మద్దతును అందించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. 

ఆమె భవిష్యత్ బాగుండాలి: యాష్లీ

మోనికా రైట్‎తో వివాహ బంధం విచ్ఛన్నం కావడం పట్ల యాష్లీ గార్డనర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోనికాతో గడిపిన సమయం ఎంతో విలువైనదని.. దానికి తాను కృతజ్ఞురాలిని అన్నారు. ఆమె భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని.. మరిన్నీ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశంపై ఇంతకు మించి తాను మాట్లాడలేనన్నారు. తమ ప్రైవసీని గౌరవించాలని ఈ సందర్భంగా యాష్లీ కోరారు. 

మోనికా రైట్ సంచలన ఆరోపణలు:

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ యాష్లీ గార్డనర్‎పై ఆమె భాగస్వామి మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేశారు. యాష్లీ గార్డనర్ తన సహచర క్రీడాకారిణి జార్జియా వోల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. 

యాష్లీ తనను మోసం చేసిందని వాపోయిన రైట్.. ఆమెను వైస్ కెప్టెన్సీని తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా మౌనం వహిస్తే యాష్లీ, జార్జియా వోల్ అనైతిక సంబంధానికి మద్దతు ఇస్తున్నట్లేనని హాట్ కామెంట్ చేశారు. కెప్టెన్ అంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాలని.. ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకునే వ్యక్తి నాయకత్వ స్థానంలో ఉండకూడదని అన్నారు. 

2025లో ప్రేమ, పెళ్లి

ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ యాష్లీ గార్డనర్, మోనికా రైట్ 2025, ఏప్రిల్ లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. అయితే, అదే ఏడాదిలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం గార్డనర్ భారత్‌లో ఉన్నప్పుడు విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తన సహచర క్రీడాకారిణీ జార్జియా వోల్‌తో గార్డనర్‌కు వివాహేతర సంబంధం ఉందని మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి నుంచి వారిద్దరు విడిపోయారు.

©️ VIL Media Pvt Ltd.