Reading Time: 2 minutes
Sourav Ganguly Wife Dona Receive Death Threats Police Probe

Sourav Ganguly Receive Death Threats: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బెదిరింపు లేఖలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా తనకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని దాదా సోమవారం దక్షిణ కోల్‌కతాలోని ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సోమవారం వచ్చిన లేఖల్లో గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని చంపుతామని, అంతేకాదు దాదాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను కూడా వదిలిపెట్టమని లేఖల్లో హెచ్చరించినట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఈ బెదిరింపు లేఖల్లో అసలు ఎందుకు చంపుతున్నాం, డిమాండ్స్ ఏంటో ఉండకపోడం విశేషం.

ఆరు నెలలుగా బెదిరింపు లేఖలు:

సోమవారం సౌరవ్ గంగూలీ కార్యాలయానికి రెండు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదా తరఫున ఆయన మేనేజర్ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు?, అతడి ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు ఆరు నెలలుగా గంగూలీ పేరుతో బెదిరింపు లేఖలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదా తొలుత వాటిని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. అయితే తాజాగా వచ్చిన లేఖల్లో కుటుంబం, సన్నిహితులకు ప్రాణహాని ఉండటంతో పోలీసులను ఆశ్రయించారు.

కొరియర్ సర్వీస్ ద్వారా లేఖలు:

ఈ లేఖలు కొరియర్ సర్వీస్ ద్వారా పంపించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బెల్‌ఘరియా ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి లేఖలు వచ్చి ఉండొచ్చని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సంబంధిత కొరియర్ సంస్థను సంప్రదించిన పోలీసులు.. లేఖలు ఎక్కడి నుంచి పంపించారనే వివరాలను సేకరిస్తున్నారు. అలాగే బెదిరింపు లేఖలు పంపేందుకు ఉపయోగించిన సిమ్ కార్డు, మొబైల్ నంబర్ కాల్ లిస్టును కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఒక మొబైల్ నంబర్‌ను గుర్తించినట్లు, దాని ఆధారంగా సంబంధిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారట.

బెదిరింపులకు అసలు కారణం ఏంటి:

సౌరవ్ గంగూలీకి గతంలో వచ్చిన లేఖలు, తాజాగా వచ్చిన బెదిరింపు లేఖలు అన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయా? లేదా వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బెదిరింపులకు అసలు కారణం ఏమిటనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. భారత జట్టుకు సారథ్యం వహించి.. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సేవలందించిన గంగూలీ ప్రస్తుతం క్రికెట్ పరిపాలనలో కీలకంగా కొనసాగుతున్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గంగూలీకి బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపింది.