Reading Time: 2 minutes

TejaIrumudi Trailer: కూతురి కోసం తండ్రి పోరాటం.. రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ అదిరింది!

Caption of Image.

మాస్ మహారాజ్ రవితేజ , దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ రిలీజ్ కు సిద్ధమైంది. ఆగస్టు 21న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈ చిత్రంపై ఉన్న  అంచనాలను మరింత పెంచేసింది. ఈసారి రొటీన్ కమర్షియల్ కథకు భిన్నంగా.. భావోద్వేగం, కుటుంబ బంధం, భక్తి, థ్రిల్ కలగలిసిన కథతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

కథేంటంటే.?

కథలో త్రినాథ్‌గా రవితేజ కనిపిస్తారు. మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపించే త్రినాథ్‌కు తన కూతురు అంటే ప్రాణం. ఆమె చేసే ప్రతి చిన్న పనినీ పండుగలా భావించే తండ్రి అతడు. కూతురి కోసం ఏటా 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టి.. ఆ సమయంలో మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటాడు. ఇలా కుటుంబంతో హాయిగా సాగిపోతున్న అతడి జీవితంలో అనుకోని పరిణామాలు కలకలం రేపుతాయి.

ఊరిలో స్కూల్‌కు వెళ్లే బాలికలు వరుసగా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కథను కీలక మలుపు తిప్పుతుంది. ఈ దారుణాల వెనుక ఉన్నది ఎవరు? బాలికలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అనే ప్రశ్నలు త్రినాథ్‌ను వెంటాడతాయి. సమస్యలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అతడు విలన్లపై ఎదురుతిరుగుతాడు. 

అయితే త్రినాథ్ బలహీనతను గుర్తించిన నేరస్థులు.. అతడు అయ్యప్ప దీక్షలోకి వెళ్లే సమయాన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలని పన్నాగం పన్నుతారు. దీక్షలో ఉన్న సమయంలో పోరాటాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. ఈ పాయింట్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచుతోంది.

ఎమోషనల్ హీరోగా..

రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్, కూతురిగా బేబీ నక్షత్ర కనిపించనున్నారు. తండ్రి–కూతురు అనుబంధాన్ని ట్రైలర్‌లో చూపించిన తీరు హృదయాలను హత్తుకునేలా ఉంది. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రానుంది. కూతురి కోసం తండ్రి చేసే పోరాటం, భక్తి నేపథ్యం, మిస్టరీ, యాక్షన్ కలయిక ఎలా ఉండబోతుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.