Reading Time: < 1 minute
Cbfc Censor Board Rule Change No Post Certification Edits

ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డు (CBFC) ఒక కీలకమైన సవరణకు శ్రీకారం చుట్టింది. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సినిమాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలు కల్పిస్తున్న నిబంధనలను తొలగించినట్లు స్పష్టమవుతోంది. దీనితో ఇకపై సెన్సార్ సర్టిఫికేట్ పొందిన వర్షనే ఆఖరిది (ఫైనల్ కట్) కావాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా విడుదలయ్యాక థియేటర్లలో లభించే రెస్పాన్స్‌ను బట్టి లేదా రన్‌టైమ్ ఎక్కువైందనే కారణంతో దర్శక-నిర్మాతలు కొన్ని సీన్లను ట్రిమ్ చేయడమో, లేదా అదనంగా కొత్త సీన్లను కలుపడమో చేస్తుంటారు. గతంలో ఉన్న ప్రొవిజన్ ఆధారంగా ఈ రీ-ఎడిటింగ్ చేసిన వెర్షన్‌ను రీ-సెన్సార్ లేదా ఆమోదం పొంది థియేటర్లలోకి తీసుకొచ్చే వెసులుబాటు ఉండేది.

కానీ తాజా మార్పుల ప్రకారం, ఒకసారి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ సినిమాలో ఎటువంటి కట్స్ లేదా ఎడిట్స్ చేయడానికి అనుమతి ఉండదు. డైరెక్టర్లు తమ సినిమాకు సంబంధించిన చివరి వెర్షన్‌ను మాత్రమే సెన్సార్ బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా క్వాలిటీ, స్పష్టత పెరగడానికి ఇది దోహదపడుతుందని కొందరు భావిస్తుంటే, థియేట్రికల్ రెస్పాన్స్ ఆధారంగా మార్పులు చేసుకునే అవకాశం లేకపోవడం మేకర్స్‌కు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.