
Google Pixel Watch 5: గూగుల్ (Google) నుండి గూగుల్ స్మార్ట్‌వాచ్ పిక్సల్ వాచ్ 5 (Google Pixel Watch 5)ను పిక్సల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు భారత మార్కెట్లో విడుదల చేసింది. Wear OS 7పై పనిచేసే ఈ స్మార్ట్‌వాచ్‌ను 41mm, 45mm రెండు సైజుల్లో తీసుకొచ్చింది. బ్రైట్ డిస్‌ప్లే, జెమినీ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు, మెరుగైన GPS, హెల్త్ ట్రాకింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
3,000 నిట్స్ డిస్‌ప్లే:
ఈ కొత్త వాచ్ 5లో 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో Domed Actua 360 డిస్‌ప్లే అందించారు. దీనికి కస్టమ్ 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ ఉంది. 320ppi AMOLED LTPO ప్యానెల్ 1Hz నుంచి 60Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకోగలదు. ఆల్వేస్-ఆన్ డిస్ప్లే సపోర్ట్‌తో పాటు కనీసం 1 నిట్ బ్రైట్‌నెస్‌కు తగ్గించుకునే అవకాశం ఉంది. DCI-P3 కలర్ గ్యామట్‌కు కూడా డిస్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. కొత్తగా 11 గ్లాంసీల్ కంప్లికేషన్ స్టైల్స్, రెండు కొత్త వాచ్ ఫేస్‌లు, జెనెరేటివ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి.
పిక్సల్ వాచ్ 5 బాడీ కోసం 100% రీసైకిల్ చేసిన అల్యూమినియంను ఉపయోగించారు. రెండో తరం HNBR ఆక్టివ్ బ్యాండ్ కు సాఫ్ట్-టచ్ కోటింగ్ ఉంది. ఫాగ్, ఆలివ్, కెన్యాన్ కలర్ ఆప్షన్లు వీటికి లభిస్తాయి. కెన్యాన్ కలర్ మాత్రం 41mm మోడల్‌కు మాత్రమే ప్రత్యేకంగా ఉంది. 45mm వేరియంట్‌లో స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో పాటు చెమటను త్వరగా గ్రహించే “పెర్ఫార్మన్స్ లూప్ బ్యాండ్” వస్తుంది.
Geminiతో మరింత స్మార్ట్‌గా..
ఈ వాచ్ లో జెమినీ ఆధారిత ఫీచర్లను గూగుల్ మరింత విస్తరించింది. “At a Glance” ఫీచర్ యూజర్‌కు అవసరమైన సమాచారాన్ని సందర్భానుసారంగా వాచ్ ఫేస్‌పైనే చూపిస్తుంది. “రైజ్ టు టాక్” ఫీచర్ ద్వారా మణికట్టును పైకి ఎత్తి “జెమినీ”ని యాక్సెస్ చేయవచ్చు. వర్కౌట్ ప్రారంభించడం, టైమర్ సెట్ చేయడం, జిమెయిల్ లో ఉన్న డిన్నర్ రిజర్వేషన్ వివరాలను తెచ్చుకోవడం వంటి పనులను వాయిస్ కమాండ్స్‌తో చేయొచ్చు.
కొన్ని కీలకమైన చర్యలు డివైజ్‌లోనే ప్రాసెస్ అవుతాయి. దీంతో తక్కువ లేటెన్సీతో పనిచేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ లేకపోయినా ఉపయోగించుకోవచ్చు. జెమినీ ప్రోయాక్టీవ్ సజెషన్స్ ద్వారా క్యాలెండర్‌లోని కుటుంబ డిన్నర్ వంటి సంబంధిత సమాచారాన్ని గుర్తించి వాచ్‌లో సూచనగా చూపిస్తుంది. యూజర్లు డబుల్-పించ్ జెస్చర్‌తో సూచనను సెలెక్ట్ చేసి, కన్ఫర్మ్ చేసి పంపవచ్చు.
కొత్త ప్రాసెసర్:
పిక్సల్ వాచ్ 5లో Qualcomm Snapdragon W5 Gen 2 Accelerated ప్రాసెసర్‌తో పాటు Cortex-M55 కో-ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గత తరం కంటే ఇందులో 50% ఎక్కువ ర్యామ్, 12% CPU బూస్ట్ లభిస్తాయి. మొత్తంగా గత తరం కంటే 20% వేగంగా పనిచేస్తుందని గూగుల్ తెలిపింది.
ఫిట్‌నెస్ ఫీచర్లు:
ఇందులో డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS ఉంది. GPSతో పాటు Galileo, GLONASS, BeiDou, QZSS సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. కష్టతరమైన ప్రాంతాల్లో గత తరాల కంటే రూట్ ట్రాకింగ్ ఖచ్చితత్వం రెండింతలు మెరుగుపడిందని గూగుల్ చెబుతోంది. శాటిలైట్ సిగ్నల్స్ ప్రయాణించే మార్గాలను అంచనా వేసేందుకు 3D బిల్డింగ్ మోడళ్లను, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునేందుకు “వెదర్ రిఫరెన్స్ స్టేషన్స్” ను కూడా ఉపయోగిస్తుంది.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫీచర్ ద్వారా వర్కౌట్ సమయంలో దశలవారీ గైడెన్స్, సెట్లు, రెస్ట్ పీరియడ్స్, బరువు, రెప్స్ వంటి వివరాలను లాగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ హెల్త్ కోచ్ ద్వారా కస్టమైజ్డ్ స్ట్రెంగ్త్ వర్కౌట్స్, గూగుల్ హెల్త్ యాప్ ద్వారా కస్టమ్ స్ట్రెంగ్త్ రొటీన్‌లను రూపొందించుకోవచ్చు.
బ్రీతింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్:
ఇందులో బ్రీతింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్ (Breathing Emergency Detection) అనే కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేశారు. PPG, యాక్సిలరోమీటర్, బారోమీటర్ సెన్సార్లతో పాటు ఆన్-డివైస్ AIని ఉపయోగించి ఆక్సిజన్ శాచురేషన్‌లో తీవ్రమైన, నిరంతర తగ్గుదలలను గుర్తించేందుకు ఇది ప్రయత్నిస్తుంది. అత్యవసర పరిస్థితిని గుర్తించి, ధరించిన వ్యక్తి స్పందించకపోతే వాచ్ ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు కాల్ చేసి ఖచ్చితమైన లొకేషన్‌ను పంపగలదు. అయితే ఈ ఫీచర్ ప్రారంభంలో యూరప్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది.
Proactive assistance and advanced health tracking, right on your wrist with Pixel Watch 5. Learn more → https://t.co/nWzYomWX9r #MadeByGoogle https://t.co/vlTdxP1qDe
— Google (@Google) August 12, 2026
40 గంటల బ్యాటరీ:
41mm మోడల్‌లో 332mAh బ్యాటరీ ఉంటుంది. Always-On Displayతో 30 గంటల వరకు, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 48 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. 45mm మోడల్‌లో 465mAh బ్యాటరీ ఉంది. AODతో 40 గంటల వరకు, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 72 గంటల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. రెండు మోడళ్లను సుమారు 15 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. 41mm వేరియంట్ 25 నిమిషాల్లో 80%కి, 45mm మోడల్ 30 నిమిషాల్లో 80%కి చేరుకుంటుంది.
ఇతర ఫీచర్లు:
పిక్సల్ వాచ్ 5లో Bluetooth 6.0, 2.4GHz/5GHz Wi-Fi, NFC, అల్ట్రా-వైడ్ బ్యాండ్ (UWB), 64GB eMMC స్టోరేజ్ ఉన్నాయి. 5 ATM వాటర్ రెసిస్టెన్స్, IP68 రేటింగ్ కూడా లభిస్తుంది. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్, టచ్ లెస్ వన్-హ్యాండెడ్ గెస్టర్స్, సైడ్ బటన్, Haptic Crown, Gen 3 Premium Haptics వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Android 12 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో పనిచేసే చాలా ఆండ్రాయిడ్ ఫోన్లకు Pixel Watch 5 అనుకూలంగా ఉంటుంది.
Pixel Watch 5 ధర:
భారత్‌లో గూగుల్ పిక్సల్ వాచ్ 5 (41mm) ధర రూ.42,990గా ఉంది. 45mm మోడల్ ధర రూ.45,990గా నిర్ణయించారు. భారత్‌లో ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20 నుంచి రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.