Reading Time: 2 minutes

పాకిస్థాన్ కంటే భారత్‌కే వరల్డ్ బ్యాంకు అప్పు ఎక్కువ.. కానీ అసలు తేడా ఇదే

Caption of Image.

వరల్డ్ బ్యాంకు నుంచి భారత్‌ పాకిస్థాన్ కంటే ఎక్కువ అప్పు తీసుకుందనే విషయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మార్చి 2026 నాటికి భారత్‌కు ప్రపంచ బ్యాంకు వద్ద సుమారు 34.35 బిలియన్ డాలర్ల బకాయి ఉంది. దీంతో భారత్‌ ప్రపంచ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకున్న దేశంగా కనిపిస్తోంది. ఈ లెక్కలు చూపిస్తూ భారత్‌ పాకిస్థాన్ కంటే ఎక్కువగా అప్పుల్లో ఉందని చెప్పడం మాత్రం సరైన విశ్లేషణ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇక్కడ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ పాకిస్థాన్ కంటే దాదాపు 10 రెట్లు పెద్దది.

అప్పు ఎంత? ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దది?
సింపుల్‌గా చెప్పాలంటే.. రెండు కంపెనీల్లో ఒకటి రూ.100 కోట్ల ఆదాయం సంపాదిస్తూ రూ.10 కోట్ల అప్పు తీసుకుందని, మరో కంపెనీ రూ.10 కోట్ల ఆదాయంతో రూ.5 కోట్ల అప్పు తీసుకుందని అనుకుందాం. రెండో కంపెనీ అప్పు తక్కువగా ఉన్నప్పటికీ.. దాని ఆదాయంతో పోలిస్తే అప్పు భారం ఎక్కువ కావచ్చు. దేశాల విషయంలోనూ ఇదే లాజిక్ వర్తిస్తుంది. భారత్‌ దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ సుమారు 407 బిలియన్ డాలర్లు మాత్రమే. కాబట్టి భారత్‌ ప్రపంచ బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం డాలర్లు ఎక్కువగా ఉన్నాయనే ఒక్క కారణంతో భారత్‌ ఆర్థికంగా పాకిస్థాన్ కంటే ఎక్కువ అప్పుల భారం మోస్తోందని చెప్పటం అవివేకం అవుతుంది.

భారత్‌ ఎందుకు ఇంత అప్పు తీసుకుంది?
భారత్‌ ప్రపంచ బ్యాంకుతో సంబంధం కొత్తది కాదు. 1949లోనే రైల్వేల పునర్నిర్మాణం కోసం 34 మిలియన్ డాలర్ల ఫస్ట్ లోన్ తీసుకుంది. ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టులు, స్టీల్ ఇండస్ట్రీ, వ్యవసాయం, గ్రీన్‌ రివల్యూషన్‌, రోడ్లు, విద్య, పట్టణ రవాణా, పారిశ్రామిక మౌలిక వసతులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఉపయోగపడ్డాయి. ఇటీవలి కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ, శానిటేషన్‌, పట్టణాభివృద్ధి, గంగా పునరుజ్జీవనం, రవాణా వంటి రంగాలకు నిధులు అందుతున్నాయి. అంటే ఈ అప్పులో పెద్ద భాగం అభివృద్ధి, మౌలిక వసతుల కోసం తీసుకున్నట్లు మన చరిత్ర చెబుతోంది. 

►ALSO READ | మనోళ్లను కాదని విదేశీ ఉద్యోగుల వైపు భారత కంపెనీలు.. 77% మారిన రిక్రూట్మెంట్ స్టైల్

ఇప్పుడు భారత్‌ అప్పు పెరుగుతోందా?
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. అదే భారత్‌ వరల్డ్ బ్యాంకు నుంచి కొత్త లోన్స్ తీసుకుంటూనే ఉన్నప్పటికీ, మొత్తం బకాయి అప్పు ఇటీవలి సంవత్సరాల్లో తగ్గటమే. 2020లో సుమారు 39.6 బిలియన్ డాలర్లుగా ఉన్న బకాయి, మార్చి 2026 నాటికి 34.35 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే దాదాపు 5 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేస్తోంది. దీనికి కారణం కొత్త రుణాలు రావడంతో పాటు పాత రుణాల చెల్లింపులు కూడా కొనసాగుతుండటమే. కాబట్టి కొత్తగా లోన్స్ మంజూరు కావడం, ప్రస్తుతం చెల్లించాల్సిన అప్పు పెరగడం రెండూ ఒకటే కాదు.

పాకిస్థాన్‌తో పోలిక ఎందుకు తప్పు?
పాకిస్థాన్‌ కూడా ప్రపంచ బ్యాంకులో ప్రధాన రుణగ్రహీతే. అయితే రెండు దేశాల ఆర్థిక సామర్థ్యం ఒకే స్థాయిలో లేదు. పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు నుంచి ఉన్న బకాయి అప్పు పాత పోలికల ప్రకారం సుమారు 20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఉదాహరణకు పాకిస్థాన్‌ ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుల చారిత్రక కట్టుబాట్లు సుమారు 51.85 బిలియన్ డాలర్లు. భారత్‌ విషయంలోనూ మొత్తం చారిత్రక కట్టుబాట్లు, ప్రస్తుతం బకాయి ఉన్న అప్పు వేర్వేరు. అందుకే కమిట్మెంట్‌ను కట్టాల్సిన అప్పులతో కలిపి పోల్చడం కూడా తప్పే.

అసలు లాజిక్ ఏంటి?
భారత్‌ ప్రపంచ బ్యాంకుకు పాకిస్థాన్ కంటే ఎక్కువ డబ్బు బాకీ ఉన్న మాట వాస్తవమే. కానీ దాన్ని చూసి భారత్‌ పాకిస్థాన్ కంటే ఎక్కువ అప్పుల భారం మోస్తోందని అనుకోవటం మాత్రం సరికాదు. తెలుగులో పిండి కొద్ది రొట్టే అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది. ప్రపంచ బ్యాంకు అప్పు మొత్తం ఒక దేశ ఆర్థిక స్థితికి పూర్తి కొలమానం కాదు. మొత్తం ప్రభుత్వ అప్పు, GDP, ప్రభుత్వ ఆదాయం, విదేశీ మారక నిల్వలు, అప్పు చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను కలిపి చూడాలి. అందుకే భారత్‌ ఎక్కువ అప్పు తీసుకుంది అనేది సంఖ్యాపరంగా నిజమే అయినప్పటికీ.. “భారత్‌ పాకిస్థాన్ కంటే ఎక్కువ అప్పుల భారంలో ఉంది” అనేది ఆ సంఖ్యతో మాత్రమే నిరూపించలేని వాదన. లాజిక్ మిస్ అయితేనే ప్రచారంలో ఉన్న మ్యాజిక్ నిజం లాగా కనిపిస్తుంది అంతే. 
 

©️ VIL Media Pvt Ltd.