
Vikram Controversy: ఒక చిన్న వీడియో.. అందులో ఓ స్టార్ హీరో అరుదైన కోతితో సరదాగా గడుపుతున్న దృశ్యాలు.. ఆ తర్వాత అదే వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీయడం.. చివరకు అటవీ శాఖ విచారణకు రంగంలోకి దిగడం. ప్రస్తుతం నటుడు చియాన్ విక్రమ్‌కు సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇలాంటి పరిస్థితినే తీసుకొచ్చింది. లార్ గిబ్బన్ అనే అరుదైన కోతితో విక్రమ్ కనిపించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో వన్యప్రాణి అధికారులు దృష్టి సారించారు. అసలు ఆ గిబ్బన్ ఎవరిది? అది ఎక్కడి నుంచి వచ్చింది? దానిని పెంచుకోవడానికి అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. విక్రమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఒక చిన్న లార్ గిబ్బన్‌తో ఆడుకుంటూ, దానిని కౌగిలించుకుంటూ కనిపించారు. ఆ వీడియోపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కొంత సేపటికే ఆయన దానిని తొలగించారు. అయితే అప్పటికే ఈ వ్యవహారం తమిళనాడు అటవీ శాఖ దృష్టికి వెళ్లింది. అధికారులు ఇప్పుడు ఆ జంతువు నేపథ్యం, దాని యాజమాని ఎవరు, అనుమతి పత్రాలు వంటి అంశాలపై విచారణ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ లార్ గిబ్బన్ విక్రమ్ కుమార్తె అక్షిత మామగారైన వ్యాపారవేత్త సి.కె. రంగనాథన్‌కు చెందినదిగా తెలుస్తోంది. జూన్‌లో మణిపూర్ నుంచి ఈరోడ్‌కు ఈ గిబ్బన్‌ను తీసుకువచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివరాలను అధికారులు ఇంకా పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది.
ఇక్కడే ఈ వ్యవహారం సోషల్ మీడియా వివాదం నుంచి వన్యప్రాణి చట్టాల అంశంగా మారింది. శాస్త్రీయంగా హైలోబేట్స్ లార్‌గా పిలిచే లార్ గిబ్బన్ ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన అరుదైన ప్రైమేట్. ఇది అంతర్జాతీయ స్థాయిలో CITES అపెండిక్స్ I పరిధిలో రక్షణ పొందుతోంది. భారతదేశంలోనూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరుదైన వన్యప్రాణిగా పరిగణించబడుతోంది. అందుకే ఈ జంతువును ఎవరు ఎలా సంపాదించారు అన్నది ఇప్పుడు అటవీ శాఖ ఆరా తీస్తోంది. చెన్నై వన్యప్రాణి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇలాంటి జంతువును కలిగి ఉన్న వ్యక్తి దానిని ఎప్పుడు, ఎక్కడి నుంచి పొందారో నిరూపించే పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అవసరమైన అనుమతులు, దిగుమతి పత్రాలు, పరివేష్ పోర్టల్ ద్వారా వన్యప్రాణి క్లియరెన్స్ వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ వ్యవహారంపై వన్యప్రాణి కార్యకర్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లార్ గిబ్బన్‌ను అక్రమంగా సంపాదించి ఉండవచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అటవీ శాఖ విచారణ పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో విక్రమ్ పాత్రపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చట్ట ఉల్లంఘన నిర్ధారణ కాలేదు. ఆయన వీడియోలో కనిపించడం, ఆ తర్వాత దానిని తొలగించడం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంశాలు. అసలు విషయాలు విచారణ తరువాతే తేలనున్నాయి. మరి అనుమతి పత్రాలు లేకపోతే అటవీశాక అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
సినిమాల విషయానికి వస్తే విక్రమ్ చివరిసారిగా ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వీర ధీర సూరన్’ లో కనిపించారు. దర్శకుడు ఆనంద్ శంకర్‌తో ఆయన కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన సినీ ప్రాజెక్టుల కంటే అరుదైన లార్ గిబ్బన్‌కు సంబంధించిన ఈ వివాదమే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది.