
మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లు ఎప్పుడు బయటకొస్తాయో చెప్పడం కష్టం. అయితే అధికారిక ప్రకటనల కంటే ముందే ఆయన నోటి నుంచి కీలక విషయాలు లీక్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక్కొసారి అనుకోకుండా చెప్పేస్తుంటారు. అందుకే ‘చిరు లీక్స్’అనే ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. లేటెస్ట్ గా మరోసారి ఇదే తరహాలో మెగాస్టార్ తన 158వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను లీక్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
చిరు లీక్స్.. ‘కదిరి’ టైటిల్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజుససక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. సంగీత దర్శకుడు తమన్‌తో సరదాగా మాట్లాడుతున్న సమయంలో తన కొత్త సినిమా టైటిల్‌ను బయటపెట్టేశారు. తన బర్త్‌డే సందర్భంగా విడుదల కానున్న టీజర్ గురించి మాట్లాడుతూ.. టీజర్ చివర్లో ‘కదిరి’ టైటిల్ వేస్తారా? అంటూ తమన్‌ను అడిగారు. అంతే.. అసలు సర్‌ప్రైజ్ అక్కడే రివీల్ అయిపోయింది. అయ్యో టైటిల్ చెప్పేశానా అంటూ మధ్యలోనే మాట్లాడటం ఆపేశారు.
అప్పటివరకు అధికారికంగా ప్రకటించని టైటిల్ చిరంజీవి నోటి నుంచి బయటకు రావడంతో మెగా అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ‘చిరు లీక్స్’ మరోసారి ట్రెండ్ అవుతుండటంతో ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
#Mega158 Title Leak by Chiranjeevi#Chiruleaks pic.twitter.com/hJnWoPrJvH
— Indian Clicks (@IndianClicks) August 11, 2026
యాక్షన్ డ్రామాగా..
బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్, రచితా రామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
►ALSO READ | ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన సురేష్ బాబు.. ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్ అదిరిపోయిందిగా..!
ఇక మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘కదిరి’టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిరంజీవి వేదికపై ప్రకటించేశారు.. టైటిల్ లీక్‌తోనే ఇంత హైప్ క్రియేట్ చేసిన చిరు.. ఇక టీజర్‌తో ఎలాంటి మాస్ ట్రీట్ ఇస్తారో చూడాలి.